Rains in AP: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ప్రధాన రహదారులను సైతం ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఏపీ తెలంగాణా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చి చేరుతుంది. ఈ వరద నీటిని నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తి నీటి నిల్వఉంది. బ్యారేజీలోని ప్రకాశం బ్యారేజ్ 14 గేట్లు అడుగు మేర ఎత్తిన అధికారులు సముద్రంలోకి 10,290 క్యూసెక్కుల నీటిని, కాల్వలకు 5,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో వరదపోటు పెరగడంతో.. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం భారీగా చేరింది. ఆనకట్ట వద్ద ఉదయం ఏడు గంటలకు 11.5 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో డెల్టా కాల్వలకు పదకొండు వేల వంద క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆనకట్ట 175 గేట్ల నుంచి 9 లక్షల 58 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో భద్రాచలం వద్ద కూడా గోదావరి ప్రవాహం మరింతగా తగ్గుతోంది. ఈ సాయంత్రానికి గోదావరి వరద మరింతగా తగ్గనుంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరిన ప్రవాహం తెల్లవారుజాము నుంచి తగ్గుముఖం పట్టింది.గోదావరికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా లంక గ్రామాల ప్రజల కష్టాలు మాత్రం తీరటం లేదు. కోనసీమలోని కనకాయలంక, ఆనగారిలంక, పెదమల్లంక, బూరుగులంక, ఊడిమూడి లంక, అరిగెల వారిపేట తదితర లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. రోజూవారి అవసరాల కోసం, ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ద్విచక్రవాహనాలు పడవలపై ఉంచి గోదావరిని దాటుతున్నారు. కోనసీమ ప్రాంతంలోని వశిష్ట, వైనతేయ గోదావరి నది పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లోని లంక గ్రామల్లో వరద ఉద్ధృతి తగ్గక పోవడంతో ప్రజలు మర పడవలు, నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి లంక వద్ద వృద్ధ గౌతమీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు.. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయినవిల్లిలంక ఎదురుబిడియం కాజ్‌వేపైకి భారీగా వరద నీరు చేరింది. వాహనాదారులు, కళాశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మోకాల్లోతు నీటిలోనే జనం రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల్లో నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని రాయగడ వంతెన ఆప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి ధ్వంసమై కుంగిపోయింది. 50 గ్రామాలకు అనుసంధానమైన ఈ వంతెన కూలిపోవటంతతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అంబులెన్సు వెళ్లే మార్గం లేక రోగులు అవస్థలు పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వంతెనను పరిశీలించారు. టీడీపీ హయాంలో నిర్మించిన వంతెనకు మరమ్మతులు చేయకపోవటం దారుణమన్నారు.