కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 22 నుంచి బడులు పూర్తిస్థాయిలో మూతబడ్డాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాకపోయినప్పటికి విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో లాక్‌డౌన్‌లోనూ బియ్యం, కోడిగుడ్లు, చిక్కీలను పంపిణీ చేశారు. చివరిసారిగా జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు రెండు విడతల్లో బియ్యంతోపాటు 56 కోడిగుడ్లు, 35 చిక్కీలను పంపిణీ చేశారు. సెప్టెంబరు నెలకు వచ్చేసరికి కోడిగుడ్ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా కందిపప్పు కేటాయించారు.
రూ.124 విలువగల కందిపప్పు..
ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి రెండున్నర కేజీల బియ్యం, రూ.124.25 విలువచేసే కందిపప్ఫు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్కరికి 3 కేజీల 750 గ్రాముల బియ్యం, రూ.186.25కు విలువచేసే కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 1,60,710 మంది, ప్రాథమికోన్నత.. ఉన్నత పాఠశాలల విద్యార్థులు 1,64,236 మంది కలిపి మొత్తం 3,24,946 మంది ఉన్నారు. వీరికి కందిపప్పు పంపిణీ చేసేందుకు నిర్దేశించిన నగదు ప్రకారం రూ.5.05 కోట్ల వ్యయం అవుతుంది. జిల్లాలో అంత కందిపప్పును పౌరసరఫరాల సంస్థ నుంచి తీసుకునే అవకాశం లేదు. ఎవరికైనా టెండర్ ఇచ్చేందుకు రూ.5 లక్షలు దాటితే ఆన్‌లైన్‌తోపాటు రూ.కోట్ల వ్యయం కావడంతో రివర్సు టెండర్ పిలవాల్సి ఉంది.
జేసీ పరిశీలనకు ఎదురుచూపులు..
పాఠశాలల్లో పంపిణీ చేయాల్సిన కందిపప్పును ఎలా రవాణా చేసుకోవాలనే అంశంపై స్పష్టత కోసం దస్త్రం తయారుచేసి జిల్లా సంయుక్త కలెక్టర్ పరిశీలనకు ఎదురుచూస్తోంది. ఆయన తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా కందిపప్పు రవాణా కాబోతుంది. మరోవైపు సెప్టెంబరు, అక్టోబరు నెలల బియ్యం కేటాయింపులు జరగలేదు. ఈ నెల 25 నుంచి రెండు నెలల బియ్యం ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరి అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా కాబోతున్నాయి. బడులకు రెండు నెలలకు సరిపడా బియ్యం రవాణా చేసిన సెప్టెంబరు నెల బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని తాజాగా డీఈవో మార్గదర్శకాలు చేశారు.
రూ.లక్షల్లో బకాయిలు..
మరోవైపు బియ్యంతోపాటు చిక్కీలను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ఉపాధ్యాయులు సిద్ధంగా లేరు. ఏప్రిల్ నుంచి వారు తమ సొంత నగదు వెచ్చించి చిక్కీలను పంపిణీ చేశారు. 100 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలకు రూ.40 వేలు, 500 మంది ఉంటే రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువమంది ఉంటే రూ.లక్షల్లో బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిల్లా నుంచి కాకుండా రాష్ట్రం నుంచి మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లిస్తున్నారు.
పాత బకాయిలు రూ.లక్షల్లో..
పాత బకాయిలే రూ.లక్షల్లో రావాల్సి ఉండటంతో బియ్యంతోపాటు సెప్టెంబరు, అక్టోబరు నెలల చిక్కీలు పంపిణీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. బడులు మూతబడి ఉన్నప్పుడు భోజన పథకానికి సంబంధించిన సరకుల పంపిణీ సక్రమంగా చేపట్టగా గత నెల రోజుల నుంచి 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు.
ఆగిన గోరుముద్ద పథకం..
ఇలాంటి తరుణంలో గోరుముద్ద ఆగిపోవడం ఇబ్బందికర పరిణామంగా ఉంది. కందిపప్పు పంపిణీలో ఉన్న ఇబ్బందులు తొలగించడంతోపాటు అక్టోబరు నెలలో బియ్యంతోపాటు పంపిణీ చేయబోయే సరకుపై స్పష్టతను ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరముంది. జేసీ నిర్ణయానికి అనుగుణంగా త్వరితగతిన సెప్టెంబరు నెలకు కేటాయించిన కందిపప్పును విద్యార్థులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని మధ్యాహ్న భోజన పథకం జిల్లా ఏడీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : మేం పెయిడ్ ఆర్టిస్టులమైతే...మరి మీరెవరు ?: అమరావతి రైతులు