తన పేరిట ఉన్న స్థలానికి గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు వేరే వ్యక్తితో ఆస్థి పన్ను కట్టించుకున్నారని జాన్సన్ అనే వ్యక్తి ఆరోపించారు. నగరానికి చెందిన జాన్సన్‌కు అన్నపూర్ణ నగర్లో ఓ స్థలం వారసత్వంగా వచ్చింది. అయితే 2012లో నరసింహరావు అనే వ్యక్తి దానిపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి స్థలం కబ్జా చేశారని జాన్సన్ ఆరోపించారు. ఈ విషయంలో రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.
న్యాయస్థానంలో కేసు సైతం నడిచిందని.. 2015లో నరసింహరావు లోక్ అదాలత్ ద్వారా రాజీకి వచ్చి స్థలం తనదేనని చెప్పి వైదొలిగారన్నారు. ఆ తర్వాత యాజమాన్య హక్కులన్నీ తన పేరిట మార్చుకున్నానని జాన్సన్ తెలిపారు. 2019లో దీనికి సంబంధించి మ్యూటేషన్ సర్టిఫికెట్ కోసం కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా చెప్పారు. అందుకు అవసరమైన రుసుం చెల్లించానన్నారు.
అయితే.. 2018 లోనే వెంకట రమణయ్య అనే వ్యక్తి ఈ స్థలానికి ఆస్తి పన్ను చెల్లించారని మున్సిపల్ అధికారులు చెప్పటంతో జాన్సన్ ఖంగు తిన్నారు. దీనిపై వెంకటరమణయ్యతో కోర్టులో తేల్చుకుని రావాలని అధికారులు సూచించారు. న్యాయస్థానం ఓసారి యాజమాన్య హక్కులు తనకు కట్టబెట్టిన తర్వాత స్థలం తనదే అవుతుందని..ఆ విషయం గ్రహించకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని జాన్సన్ ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం