Prashant Kishor Met Chandrababu : రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధికార వైఎస్సార్సీపీకి షాకిస్తూ ఆపార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పంచన చేరారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలో దేశంలోనే తిరుగులేనివాడిగా పేరున్న పీకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కృషి చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు 3గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో లోకేశ్‌తోపాటు ప్రస్తుతం తెలుగుదేశం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్‌శర్మ కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ ఒకప్పుడు ఐప్యాక్‌లో సహచరులే. వచ్చే ఎన్నికల్లో రాబిన్‌శర్మ, పీకే బృందాలు పరస్పర సహకారంతో తెలుగుదేశాన్ని గెలిపించేందుకు పనిచేయనున్నట్లు సమాచారం. పీకే బృందం రెండు, మూడు నెలల నుంచే తెలుగుదేశం కోసం పనిచేయడం ప్రారంభించింది.
Chandrababu Meeting with Election Strategist PK : గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడం వెనక పీకే చాలా కీలకంగా వ్యవహించారు. తాను పనిచేస్తున్న పార్టీ విజయం కోసం ఆయన ఎంతవరకైనా వెళ్తారని ఎలాంటి వ్యూహాలైనా రచిస్తారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, అతి త్వరలోనే చెడ్డపేరు తెచ్చుకోవడం చూసి ఆయన అంతర్మథనానికి గురయ్యేవారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ‘ఇలాంటి పార్టీ గెలుపు కోసమా నేను పనిచేసింది?’ అని ఆయన చాలాసార్లు ఆవేదన చెందినట్లు తెలిసింది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్! టార్గెట్ 2024!!
Election strategist PK Work With CBN For 2024 Elections : జగన్ ప్రభుత్వ విధానాలను సైతం ఆయన ఒకటి, రెండుసార్లు బహిరంగ వేదికలపైనే పరోక్షంగా విమర్శించారు. గతంలో తమిళనాడు, పంజాబ్, బిహార్, పశ్చిమబెంగాల్, దిల్లీలో వివిధ పార్టీల కోసం పనిచేసిన పీకేలో గతంలో తాను అధికారంలోకి తెచ్చిన ఏ పార్టీ ప్రభుత్వమూ ఇంతగా చెడ్డపేరు మూటగట్టుకోలేదన్న భావన చాలా బలంగా ఉన్నట్టు సమాచారం. వైఎస్సార్సీపీ వంటి విధ్వంసకర పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశానని ఆయన మథనపడుతున్నట్టు సమాచారం. దాన్ని సరిదిద్దుకోవడానికే తెలుగుదేశంతో పనిచేయాలని నిర్ణయించుకున్నారా లేక మునిగే పడవను వదిలేసి గెలుపు గుర్రంవైపు చేరారా.. అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
2024 Elections in AP : హైదరాబాద్ నుంచి లోకేశ్‌తో కలిసి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిశోర్ నేరుగా ఉండవల్లి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుమారు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి.. వంటి అంశాలపై సూచనలు చేసినట్లు సమాచారం. ప్రాంతాలవారీగా అనుసరించాల్సిన ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. టీడీపీ-జనసేన పొత్తును మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, మ్యానిఫెస్టోలోని అంశాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలిసింది. చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన తెలిపారు.
Prashanth Kishore : ఈసారి పీకే పాచికలు పారుతాయా?
Prashant Kishor Comments on YSRCP : 2016లో వైఎస్సార్సీపీతో ఒప్పందం చేసుకున్న పీకే 2019లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు. తర్వాత ప్రభుత్వ విధానాలు నచ్చక క్రమంగా ఆ పార్టీకి దూరమయ్యారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్న ఆయన ఐప్యాక్ నుంచి కూడా బయటకు వచ్చేసి కొన్నాళ్లపాటు బిహార్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ తరపున పనిచేసి తప్పు చేశానని అక్కడ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
PK Sensational Comments on CM Jagan Government : ఇటీవల 'బ్రాండ్ అవతార్' కార్యక్రమంలో పీకే మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. చంద్రబాబుతో పీకే భేటీ కావడంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. పీకేను విమర్శిస్తూ ఆ పార్టీ నేతలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలే వారి ఆందోళనను తెలియజేస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఐప్యాక్ మాత్రం.వైఎస్సార్సీపీతోనే ఉన్నామంటూ స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గెలిపించేందుకు కృషి చేస్తామని ఎక్స్‌లో ప్రకటించింది. ఒకప్పుడు పీకే సహచరుడైన రిషిరాజ్‌సింగ్ ప్రస్తుతం వైఎస్సార్సీపీ కోసం పనిచేస్తున్నారు.
ముగిసిన బాబు, పీకే సమావేశం- పార్టీ క్యాడర్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రశాంత్ కిషోర్