కుటుంబ సమస్యలతో విసిగిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుందామని భావించింది. ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఫేస్ బుక్లో ఈ పోస్టు చూసిన ఓ వ్యక్తి స్పందించాడు. గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావుకి సమాచారం ఇచ్చాడు. ఆయన వెంటనే స్పందించి పోలీసులను రంగంలోకి దింపారు. ఎంతో చాకచక్యంగా ఆ యువతి ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆమెని ఆత్మహత్య చేసుకోకుండా ఆపారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ములకలూరులో జరిగిన ఈ ఘటన పోలీసుల పనితనానికి నిదర్శనంలా నిలిచింది.
అనంతరం పోలీసులు ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. కుటుంబ సభ్యులందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కుటుంబంలో సమస్యలు తలెత్తిన విషయం వారు వివరించారు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయని పోలీసులు వారికి ధైర్యం చెప్పారు. ఆత్మహత్య నుంచి యువతిని కాపాడిన విషయం డీజీపీ గౌతం సవాంగ్ తన ఫేస్ బుక్ పేజిలో పోస్ట్ చేశారు. ఇందులో పాలుపంచుకున్న పోలీసులను అభినందించారు.
ఇదీ చదవండి: ఏనుగు మృతికి కారణం ఆ ముగ్గురే!