వైద్యుడిని చంపుతామని బెదిరించి డబ్బు డిమాండ్ చేసిన ముఠాను గుంటూరు జిల్లా కొత్తపోట పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ సీతారామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, డాక్టర్ నీలిమ దంపతులు ఓ ఆసుపత్రిని నడుపుతున్నారు. వీరి వద్ద అదే ప్రాంతానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి.. కొంత కాలం వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత వేరే చోట పనికి కుదిరాడు.
గణేశ్‌కు దేవీప్రసాద్, మధుసుదనరావు, అక్బర్ బాషా అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేవీప్రసాద్.. తనకు అత్యవసరంగా డబ్బు కావాలని, ఏం చేయాలో అర్థం కావటం లేదని గణేశ్ వద్ద వాపోయాడు. తన వద్ద ఓ ఐడియా ఉందని దేవీప్రసాద్‌కు చెప్పిన గణేశ్.. దానికి కొంత రిస్క్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. తాను ఇంతకు ముందు పనిచేసిన డాక్టర్ వద్ద చాలా డబ్బు ఉందని.. డాక్టర్ చాలా భయస్థుడని.. చంపుతామని బెదిరిస్తే అడిగినంత డబ్బు ఇస్తాడని దేవీప్రసాద్‌కు చెప్పాడు.
సెల్‌ఫోన్ కొట్టేసి..
దీంతో.. డాక్టర్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. దేవీప్రసాద్, గణేశ్, మిగిలిన ఇద్దరు స్నేహితులతో కలిసి పథకం రచించారు. రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను కొట్టేసి.. అతని సెల్ ద్వారా డాక్టర్‌కు ఫోన్ చేశారు. "కొంత మంది వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి రూ.70 లక్షలు సుపారీ ఇచ్చారు.. మీ వివరాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ డబ్బును మీరే ఇస్తే మిమ్మల్ని వదిలేసి.. సుపారీ ఇచ్చిన వారిని చంపుతాం" అని రెండు రోజులపాటు డాక్టర్‌కు బెదిరింపు కాల్స్ చేశారు.
ఈ లోపు సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి తన సిమ్ బ్లాక్ చేయించటంతో నిందితులు అక్బర్ బాషా ఫోన్ నుంచి కాల్ చేసి బెదిరించటం మెుదలుపెట్టారు. భయపడిపోయిన డాక్టర్ డబ్బు ఎక్కడికి తీసుకురావాలని నిందితులను అడిగారు. మళ్లీ ఫోన్ చేసి చెబుతామని నిందితులు ఫోన్ కట్ చేశారు. ఈ లోపు వైద్యుడు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెల్ నంబర్ల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.
ఇదీ చదవండి
ఎవరికీ అనుమానం రాకుండా పెట్రోల్ ట్యాంకర్ ఎంచుకున్నారు.. కానీ..చివరికి చిక్కారు..!