సత్తెనపల్లికి చెందిన మహ్మద్ గౌస్‌కు కొద్ది నెలల కిందట ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇవాళ ఉదయం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి... వారితో మాట్లాడి తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో పోలీసులు అతన్ని ఆపారు. ఎక్కడకు వెళ్లి వస్తున్నావని ప్రశ్నించారు. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లివస్తున్నట్లు చెప్పగా... కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఎలా వెళ్తావంటూ పోలీసులు లాఠీలతో బాదారు. గౌస్ అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు.
దీని గురించి గౌస్ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా... వారు ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మరణించాడు. పోలీసుల దెబ్బలకు ఆపరేషన్ సమయంలో వేసిన కుట్లు ఊడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉదయం 9 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ... అది కేవలం నిత్యావసర సరకుల కోసమేనని పోలీసులు చెబుతున్నారు. దాన్ని ఉల్లంఘించటమే పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెట్టి జరిమానా వేస్తున్నారు. అలా చేయకుండా లాఠీలకు పని చెప్పటంపై విమర్శలు వస్తున్నాయి.
ఇదీ చదవండీ... గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు ‘కరోనా’ బీమా