గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. పెనుమాకను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన నేతలు అనుకూలంగానూ ప్రతిపక్షానికి చెందిన నాయకులు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. పురపాలక సంఘంలో కలిపితే పెనుమాకలో ప్రజలు ఇబ్బంది పడతారని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించిన వైకాపా నాయకులు అన్నీ ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు.
పెనుమాక గ్రామం రాజధాని ప్రాంతంలో ఉందని... ప్రభుత్వం పేదలకు ఇచ్చే 2,500 రూపాయల పై స్పష్టత ఇవ్వాలని అధికారులను తెదేపా నేతలు నిలదీశారు. ఈ సమయంలో ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఓటింగ్లో అనంతరం.. విలీనానికి అనుకూలంగా ప్రజాభిప్రాయం వచ్చినట్టు.. అధికారులు నిర్థరించారు.
ఇవీ చదవండి