Jana Sena chief Pawan Kalyan: వైకాపా ప్రభుత్వ అవినీతి, అక్రమాల్ని చూసే.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదని పార్టీ ఆవిర్భావ సభలో అన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఎవరి పల్లకీ మోయటానికి సిద్ధంగా లేమని... ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే జనసేన పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన 5కోట్ల విరాళం ప్రకటించారు. భాజపాతో పొత్తు ఉన్నంత మాత్రాన ప్రతి నిర్ణయాన్ని సమర్థించేది లేదన్న పవన్ .. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఆపాలని, పెట్రో ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వ్యవసాయ స్థితిగతులు, కౌలురైతుల ఆత్మహత్యలు, శాంతిభద్రతలు, అమరావతి అంశాలపై చర్చించారు. పార్టీ నాయకులు అభిప్రాయాలు వెల్లడించిన తర్వాత 6 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. జనసేన భవిష్యత్ చర్చించేందుకు సమావేశం పెట్టామన్న పవన్.. మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభ అనంతరం వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చారు. ఓట్లు చీలకుండా చూస్తామంటే వైకాపా నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు.
అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆవేదన కలిగించిందన్న పవన్.. అందుకే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించామన్నారు. ఈనెల 12న అనంతపురం జిల్లా నుంచి జనసేన రైతు భరోసా యాత్ర ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు జగన్ అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బాదుడే బాదుడు అంటే ప్రజలపై ఎంతో వేదన ఉందని భావించానని.. కానీ అధికారంలోకి వచ్చాక పన్నులు, ధరలు బాదుడంటే ఎంటో చూపారని ఎద్దేవా చేశారు.
భాజపాతో పొత్తు ఉంది కదా అని ప్రతిదానికి తలాడించాల్సిన పని లేదని పవన్ శ్రేణులకు స్పష్టం చేశారు. పెంచిన పెట్రోల్ ధరలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్న ఆయన.. కేంద్రం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. అమరావతిపై పవన్ తన వైఖరిని స్పష్టంగా వివరించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు నగరాలనూ అభివృద్ధి చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు.
వంద మంది వద్ద పన్నుల రూపంలో వసూలు చేసి మీరనుకున్న 30 మందికిస్తే మిగిలిన 70 మంది ఏం కావాలి? వారు నిశ్శబ్దంగా ఉంటారా? వారికి బాధలుండవా? బాదుడే బాదుడు అన్నమాట జనసేన సృష్టించిందా? మీరు చెప్పింది కాదా? 2018లో విద్యుత్తు బిల్లులు పెంచినప్పుడు మీరన్నది కాదా? మరి అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు తగ్గించాల్సిన బాధ్యత మీపై లేదా?. -జనసేన అధినేత పవన్‌కల్యాణ్
ఇదీ చదవండి: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చ