CPM State 26th Mahasabha: గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరుగుతున్న సీపీఎం 26వ రాష్ట్ర మహాసభల్లో.. ఈ సభల్లో పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. పలు అంశాలపై నాయకులు ప్రసంగించారు.
మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు: సీతారాం ఏచూరి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేలా అందరూ కలిసి పోరాడాలని.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 70 ఏళ్లుగా ఉన్న సెక్యులర్ పునాదులను కదిలించేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దేశాన్ని సెక్యులరిజం నుంచి సోషలిజం వైపు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వచ్చాక.. రాష్ట్రాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయని.. రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం లాగేసుకుంటోందని ఆరోపించారు. మూడు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుందని అభిప్రాయడ్డారు.
రాజధాని వివాదానికి స్వస్తి చెప్పాలి: వి.శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి స్వస్తి చెప్పి, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు వి.శ్రీనివాసరావు తీర్మానం ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతిలో.. హైకోర్టు కర్నూల్ లో ఉండాలనేది సీపీఎం విధానమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తక్షణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. నవరతత్నాలతోనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయనేది భ్రమ మాత్రమేనన్నారు. వైకాపా సర్కారు రెండున్నరేళ్లలో కనీసం ఇసుక సమస్యను పరిష్కరించలేకపోయిందని ఎద్దేవా చేశారు. మద్యం, సినిమా టికెట్ల ధరలు తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాల ధరలు తగ్గించి.. అప్పుడు మాట్లాడాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు.
ఐక్యంగా పోరాడాలి: తమ్మినేని వీరభద్రం
ఐక్య పోరాటాల ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దారిలో పెట్టాలని.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటేనన్నారు. దేశవ్యాప్తంగా భాజపా మతోన్మాద రాజకీయాలు చేస్తూ.. ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతోందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో.. ప్రధాని మోదీ మెడలు వంచిన రైతుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఆ చట్టాలు రద్దు చేయకపోతే.. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టేవారని అభిప్రాయపడ్డారు. అమెరికా, భారత్ వంటి దేశాల్లోనే కరోనా తగ్గటం లేదని.. కమ్యూనిస్టు దేశాల్లో ఎందుకు తగ్గిందో ఆలోచించాలన్నారు. అశాస్త్రీయమైన విధానాలతో మన వైద్య వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. కరోనా సమయంలో ప్రజలకు ఉపాధి చూపటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
లెఫ్ట్ పార్టీలు కలవాలని అందరూ కోరుకుంటున్నారు: సీపీఐ రామకృష్ణ
కమ్యూనిస్టుల ఐక్యతపై.. సీపీఎం మహాసభల్లో ఆసక్తికర చర్చ జరిగింది. లెఫ్ట్ పార్టీలు కలవాలని అందరూ కోరుకుంటున్నారని.. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విలీన ప్రతిపాదనను 16 ఏళ్ల క్రితం బి.వి.రాఘవులు చేశారని.. ఆ ప్రతిపాదన ఒక్క అడుగూ ముందుకెళ్లలేదని అన్నారు. దీనిపై స్పందించిన రాఘవులు.. రాజకీయాలు, ఓట్లు-సీట్ల కోసం కలిస్తే లాభం లేదని , విధానాలు కలిసినప్పుడే లెఫ్ట్ పార్టీల ఐక్యత సాధ్యమన్నారు. అయితే.. విధానాలమీదనైనా చర్చ జరగాలి కదా అని ప్రశ్నించారు రామకృష్ణ.
ఇదీ చదవండి:
Capital Issue in High Court: రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ వాయిదా