Avinash Reddy followers Attack on Media: హైదరాబాద్‌లో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు మీడియా ప్రతినిధిపైనా, వాహనంపైనా దాడి చేయడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా వాహనాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యన్నారు. ఇది వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమన్నారు. మీడియా వాహనంపై, ప్రతినిధులపై దాడి చేస్తే సీబీఐ వెంటాడకుండా ఉంటుందా.? అరెస్ట్ ఆగుతుందా అంటూ నిలదీశారు.
విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధిలపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. మీడియా ప్రతినిధులపైన దాడి హత్యాయత్నం కిందకే వస్తుందని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు.
అవినాష్ రెడ్డి అనుచరుల దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. హైదరాబాద్ లో మీడియాప్రతినిధులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని ఆయన ఖడించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆయన అనుచరులతో దాడి చేయించడం దుర్మార్గమని బీజేపీ నేత పురందేశ్వరి విమర్శించారు. వివేకా హత్య కేసులో విచారణకు హాజరవకుండా.. అవినాశ్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని.. బీజేపీ నేతఆదినారాయణరెడ్డి మండిపడ్డారు.
బెయిల్ పిటిషన్‌ను అన్ని న్యాయస్థానాలు కొట్టివేసినా.. ఇంకా ప్రయత్నాలు ఆపడం లేదని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులకు త్వరగా శిక్షపడేలా చూడాలని సీబీఐని కోరారు. వివేకా హత్య కేసులో పత్రికల్లో వస్తున్న కథనాలు చూసి తట్టుకోలేకే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వేధింపులతో మీడియాను కట్టడి చేయాలని చూడటం సరికాదన్నారు.
"సీబీఐతో ఆయన దోబూచులాడుతున్నాడు. ఎవరి వల్ల ఆయనకి అంత శక్తి వచ్చింది. వివేకానంద రెడ్డి కేసులో.. సీబీఐ తన ప్రాబల్యాన్ని , తన గౌరవాన్ని పోగొట్టుకుంటుంది అని మాత్రం చెప్పగలను. ఈ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్షించాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిని రక్షించడానికి .. సుమారు వంద కోట్లకు పైగానే కోట్లు ఖర్చు పెట్టారు". - వర్లరామయ్య, టీడీపీ నేత
"అమ్మకు బాగాలేదని.. మళ్లీ దొంగాట. అసలు ఏంటీ ఈ సాకులు. ఇది పచ్చి అబద్ధం. దోబూచులాటలు వద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ముందస్తు బెయిల్‌కి అనుమతించమని అన్నారు. అయినా సరే ఏదో ఒకటి అవకాశం కోసం చూస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో జగన్మోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి, ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు తెలిసే జరిగింది. చేసిన తప్పులను ఒప్పుకోవాలని బీజేపీ తరఫున కోరుతున్నాం". - ఆదినారాయణరెడ్డి, బీజేపీ నేత
ఇవీ చదవండి: