రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో...ప్రజలకు తరతరాలుగా సముద్రమే జీవనాధారం. అయితే ఏటా వేసవిలో చేపలవేటపై నిషేధం ఉంటుంది. చేపలు గుడ్లు పెట్టే ఈ సీజన్‌లో వేటాడితే..వాటి సంతతి తగ్గిపోతుంది. అందువల్ల ఈ 61 రోజులపాటు వేటకు వెళ్లకూడదు. చేపలవేటపై నిషేధం సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అప్పట్లో ప్రభుత్వం బియ్యం ఇచ్చేది. 2009 తర్వాత బియ్యానికి బదులు 2 వేల రూపాయల నగదు ఇవ్వటం మొదలైంది. 2015 నుంచి 4 వేలకు పెంచారు. అధికారంలోకి వస్తే ఆ పరిహారాన్ని పెంచుతామన్న హామీ ప్రకారం.... వైకాపా ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్కో మత్స్యకార కుటుంబానికి 10వేల రూపాయలు అందిస్తోంది. ఈ ఏడాదీ తమకు 10వేలు వస్తాయని మత్స్యకారులు భావించారు. అయితే కొత్త నిబంధనలు, షరతులతో...లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గనుంది.
మత్యకారుల ఇంట్లో ఎవరికైనా అమ్మఒడి అందుతున్నా 45 ఏళ్లకు పైబడిన మహిళలు పింఛను పొందుతున్నా .. వారికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వర్తించదని అధికారులు నిబంధనలు పెట్టారు. వీటిపై మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి పథకం ఇంట్లో ఇంటర్మీడియట్ చదివే పిల్లలున్న ప్రతి తల్లికీ వస్తుంది. అలాగే మత్స్యకారులు బీసీలు కాబట్టి 45 ఏళ్లు దాటితే పింఛన్ కూడా వస్తుంది. ఈ 2 పథకాలు చాలామంది మత్స్యకారులకూ అందుతుంటాయి. అలాంటి వారికి మత్స్యకార భరోసా నిరాకరిస్తే....50 నుంచి 70 శాతం మంది ఈ పథకానికి దూరమవుతామని లబ్దిదారులు వాపోతున్నారు. గతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతిఒక్కరికీ పరిహారం అందేది. అయితే ఈసారి మత్స్యకార కులానికి మాత్రమే భరోసా వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో మరబోట్లకు డీజిల్ రాయితీపై ఇచ్చేవారు. ఈసారి అదీ సరిగా రాలేదంటున్నారు మత్స్యకారులు. ఇతర పథకాలతో సంబంధం లేకుండా తమకు పరిహారం ఇవ్వాలని....మత్స్యకార సమస్యల పోరాట సమితి నేతలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ప్రభాస్ "ఫిల్మ్" లాగేసిన పోలీసులు..!