Arrangements for MLC Elections: ఈ నెల 13వ తేదీన జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఆరు జిల్లాల్లో 331 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రెండు లక్షల 9 వేల మంది ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోగా.. ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
రెండు దఫాలుగా ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపిన అధికారులు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్నిచర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 4 వేల 500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనకాపల్లి జిల్లాలో 49, అల్లూరి జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 72, మన్యం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం సెలవు దినంగా ప్రకటించగా... ప్రైవేట్ సంస్థలు కూడా ఓటు వేసేందుకు సిబ్బందికి తగు సమయం కేటాయించాలని అధికారులు సూచించారు.
"ప్రస్తుతం విభజన తరువాత 6 జిల్లాలు ఉన్నాయి. ఈ 6 జిల్లాలకు సంబంధించి సుమారు 331 పోలింగ్ కేంద్రాలు సిద్ధం అయ్యాయి. మొత్తం 4442 మంది పోలింగ్ సిబ్బందితో ఎలక్షన్స్‌కి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది". - మల్లికార్జున, విశాఖ జిల్లా కలెక్టర్
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 61 వేల 633 మంది పట్టభద్ర ఓటర్లు, 5 వేల 391 మంది ఉపాధ్యాయ ఓటర్లు.., 11 వందల 78 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఓటు వేసేందుకు 107 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. స్థానిక సంస్థల బ్యాలెట్ బాక్సులను కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలకు, పట్టభద్రుల, ఉపాధ్యాయుల బ్యాలెట్ బాక్సుల్ని అనంతపురానికి తరలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 16న జరగనున్న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
"కర్నూలు, అనంతపురం, కడపకు సంబంధించి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ 16వ తేదీన జరుగుతుంది". - పి. కోటేశ్వరరావు. కర్నూలు జిల్లా కలెక్టర్
ఇవీ చదవండి: