NTR Savaneer Committee Met CBN at Hyderabad: ఎన్టీఆర్ సావనీర్, లిటరేచర్, వెబ్ సైట్ కమిటీ సభ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ నెల 20వ తేదీన NTR పై ప్రత్యేక సంచికను, వెబ్ సైట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిటీ సభ్యులు చంద్రబాబుతో సమావేశం అయ్యి చర్చించారు. కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ కార్యక్రమ నిర్వహణను ఆయనకు వివరించారు. కమిటీకి చంద్రబాబు పలు సలహాలు, సూచనలు చేశారు.
అనంతపురంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు: ప్రాంతీయ పార్టీగా పెట్టి జాతీయస్థాయి పార్టీగా తెలుగుదేశంను మార్చిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావుకే దక్కుతుందని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వేడుకలను మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన అనంతపురం నగరంలోని కమ్మభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డితో పాటు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నేతలంతా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మరోవైపు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనతో కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన కొద్ది నెలలకే అధికారంలోకి వచ్చి.. సంచలనం సృష్టించారని నేతలు కొనియాడారు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ఆనాడు ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నారు. ఆనాడు సంపూర్ణ మధ్య నిషేధంపై మొదటి సంతకం పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్పారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించాలని చట్టం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర అని.. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన మార్పులు దేశ నాయకులు సైతం అనుకరించాలని చెప్పారు. మొదట ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
ఇవీ చదవండి: