NRI Kudaravalli Srinivasa Rao Return To America: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని ముప్పవరపు చౌదరి, లీలాకృష్ణ ప్రసాద్ ట్రస్టు భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ట్రస్టుకు సంబంధించి భూముల కబ్జాపై పోరాడుతున్న ఎన్‌ఆర్‌ఐ కుదరవల్లి శ్రీనివాసరావు అమెరికా వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెరికా పౌరసత్వం ఉన్న శ్రీనివాసరావుపై ఇటీవల పెనమలూరు పోలీసులు స్థల వివాదంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు, ఫిర్యాదుదారులతో కలిసి.. ఏపీ హైకోర్టు వద్దకు వెళ్లడం అప్పట్లో కిడ్నాప్ అంటూ కలకలం రేపింది.
ఏపీ హైకోర్టు నుంచి వెళ్లిపోయిన శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లి.. విజయవాడ, హైకోర్టు ప్రాంగణంలో తనకు ఎదురైన వేధింపులు, దాడి యత్నాలను వీడియోలతో సహా అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లారని ఆయన న్యాయవాది మహేశ్ తెలిపారు. కాన్సులేట్ అధికారులకు అంతా వివరించిన అనంతరం.. అధికారుల సాయంతో తిరిగి అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లినట్లు వివరించారు. శ్రీనివాసరావు ఆచూకీ కోసం పెనమలూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి ఇబ్బంది పెట్టారని, ఎన్‌ఆర్‌ఐ కుమార్తె కూడా కాన్సులేట్‌లో ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు అడ్వొకేట్ వివరించారు.
స్థలం ఖాళీ చేయాలని ఈనెల 17న బెదిరించినట్లుగా వచ్చిన ఫిర్యాదుతో.. శ్రీనివాసరావును ఏ3గా పెనమలూరు పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాసరావు కోసం పెనమలూరు పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ కేసును కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి గత వారం శ్రీనివాసరావు తన న్యాయవాదితో వెళ్లిన సమయంలో.. పోలీసులు అరెస్టు చేయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది.
ఆ తర్వాత అతని ఆచూకీ దొరక్కపోవడం, అమెరికా వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారన్న అనుమానంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని సమాచారం. హత్యలు, దోపిడిలు, భారీ కుంభకోణాల్లో పాల్గొన్న వారిని దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ లుక్ అవుట్ నోటీసును జారీ చేస్తారు. విమానాశ్రయాల ద్వారా విదేశాలకు వెళ్లకుండా ఆపేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు కూడా నోటీసు పంపినట్లు సమాచారం. ఇది ఆలస్యంగా ఇచ్చిన కారణంగా అప్పటికే శ్రీనివాసరావు అమెరికా వెళ్లిపోయినట్లు తెలిసింది. నోటీసుల జారీ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.