Notices to Anganwadis in AP: ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కచెల్లెమ్మలంటూ ఆప్యాయతను ఒలకబోసిన ముఖ్యమంత్రి జగన్, నేడు అదే అంగన్వాడీలపై అణచివేత కత్తిదూశారు. వేతనాలు పెంచుతామని ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు ఆ హామీలపై ప్రశ్నిస్తున్నారని ఏకంగా అంగన్‌వాడీల ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో సంజాయిషీ ఇవ్వాలంటూ వారికి నోటీసులు జారీ చేశారు.
సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వ ప్రయత్నం: సమస్యల్ని పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అణచివేసేందుకు జగన్ ప్రభుత్వం యత్నిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్‌వాడీ సేవలను జగన్ ప్రభుత్వం అత్యవసర చట్టం పరిధిలోకి తీసువచ్చి మరీ ఎస్మాను ప్రయోగించింది. ఆ తర్వాత వారి ఉద్యోగాల తొలగింపునకు తెర తీశారు. రెండు రోజుల్లోనే నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటే అంగన్‌వాడీలపై జగన్ ఎంతగా కక్షకట్టారో తెలుస్తోంది.
సీఎం జగన్ దయవల్లే నూతన సంవత్సర తొలిరోజు రోడ్డుపై ఉన్నాం: అంగన్వాడీ సంఘాల నేతలు
ఇళ్లకు నోటీసులు అంటిస్తున్న అధికారులు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొందరు అంగన్వాడీల ఇళ్లకు వెళ్లి మరీ అధికారులు నోటీసులు అంటించారు. ఈ చర్యలతో జగన్ తీరుపై అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. నోటీసులు అందిస్తే భయపడేది లేదని, నోటీసులపై పోరాటం చేస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. ఆయన ఎంతదూరం వెళ్లినా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కూడా ఆందోళనలతో హోరెత్తించారు. జైల్ భరో కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
అంగన్‌వాడీలను విధుల్లో నుంచి తొలగించే క్రమంలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం, ముందస్తుగా న్యాయ సలహాలు తీసుకుంది. ఉన్నతాధికారులు దీనిపై గత 3 రోజులుగా విస్తృతంగా చర్చిస్తున్నారు. అందులో భాగంగా మూడు రకాలుగా నోటీసులు జారీ చేయిస్తున్నారు. రిజిస్ట్రర్ పోస్టు ద్వారా వారి చిరునామాకు నోటీసులు జారీ చేయించే ప్రక్రియను ప్రారంభించారు.
రేపటి నుంచి 24 గంటల రిలే నిరాహార దీక్షలు: అంగన్‌వాడీలు
ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి: అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ నోటీసులు అంటించే ప్రక్రియ మరోకటి. ఇదేకాకుండా వారి ఆధార్‌లోని చిరునామాకు వెళ్లి నేరుగా నోటీసును కార్యకర్తలకు, ఆయాలకు అందిస్తారు. వారు తీసుకోని పక్షంలో ఇంటికి అంటించి రావాలని ఆదేశాలిచ్చారు. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్తకు మూడు రకాలుగానూ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదో నోటీసు అందిన 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, లేని పక్షంలో కాలవ్యవధి ముగిసిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులో పేర్కొంది.
అంగన్వాడీ సమ్మెపై వైఎస్సార్సీపీ సర్కార్ ఉక్కుపాదం - విరమించేదే లేదంటున్న 'అక్కచెల్లెమ్మలు'