No Water in Krishna Delta: పట్టిసీమకు పాతరేసిన ప్రభుత్వం.. కృష్ణా పశ్చిమ డెల్టా రైతుల నోట్లో మట్టికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగునీటి విడుదలపై అవగాహనారాహిత్యం కారణంగా నీరు అందక పొలాలు బీటలువారుతున్నాయి. ఇదే పరిస్థితి వారం రోజులు కొనసాగితే పంటలు ఎండిపోతాయని రైతులు వాపోతున్నారు.
Crops Drying Up Due to Lack of Irrigation Water: ప్రకాశం బ్యారేజీ కుడికాలువ కింద గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి కొరత ఏర్పడింది. డెల్టా కాలువలకు విడుదల చేస్తున్న అరకొర నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రైతులు మండిపడుతున్నారు. గోదావరికి వరద ప్రారంభంకాగానే.. పట్టిసీమ ద్వారా నీటిని తరలించి వాడుకున్నట్లయితే పులిచింతల నీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉండేది కాదని చెబుతున్నారు.
Farmers Protest: పులిచింతలలో ఉన్న కొద్దిపాటి నీటిని సైతం ఇప్పుడే వాడుకుంటే భవిష్యత్ అవసరాలకు మరింత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ నుంచి పెదవడ్లపూడి వద్ద హైలెవల్ ఛానెల్ విడిపోతుంది. ఈ కాలువ కింద 26వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 250 క్యూసెక్కుల నీరు వస్తే పంటలకు నీరందుతుంది. కానీ హైలెవల్ ఛానెల్‌కు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. నీటిలభ్యత తక్కువగా ఉన్నందున వారబందీ విధానం అమలు చేస్తున్నారు. పంట కీలకదశలో ఉండటంతో రైతులంతా ఒకేసారి నీరు పెడుతుండటంతో.. ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది.
Water Crisis in krishna Delta: ఇదే పరిస్థితి వారం రోజులు కొనసాగితే పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల మరమ్మతులు చేపట్టకపోవడం, తూటుకాడ తీయకపోవడంతో అరకొరగా వస్తున్న నీరు పొలాలకు చేరడం లేదు. బాపట్ల జిల్లాలో చివరి ఆయకట్టు రైతులు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీటిని తోడి పంటలు కాపాడుకుంటున్నారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. రైతులు మాత్రం పంటలకు నీటిని విడుదల చేయాలంటూ ఆందోళనలకు దిగుతున్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగునీటి విడుదలపై అవగాహనారాహిత్యం కారణంగా నీరు అందక పొలాలు బీటలువారుతున్నాయి. ఇదే పరిస్థితి వారం రోజులు కొనసాగితే పంటలు ఎండిపోతాయి. ప్రకాశం బ్యారేజీ కుడికాలువ కింద గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి కొరత ఏర్పడింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది." - రైతుల ఆవేదన