గుంటూరు సర్వజనాస్పత్రి... హృదయ సంబంధిత వైద్యసేవలకు చిరునామాగా ఉండేది. 98 శాతం విజయవంతమైన హృదయ శస్త్ర చికిత్సలను ఈ విభాగం నమోదు చేసుకుంది. దేశంలోనే ఇది ఓ రికార్డు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలోని సహృదయ ట్రస్ట్, జీజీహెచ్‌కు మధ్య మూడేళ్ల అవగాహన ఒప్పందం ద్వారా మంచి ఫలితాలు రాబట్టారు. రోజూ ఇక్కడ శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ప్రత్యేకించి నాలుగు క్లిష్టతరమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రులపై వైద్యులు భరోసా కల్పించారు. ఇక బైపాస్ సర్జరీలైతే వందల సంఖ్యలో నిర్వహించారు. ప్రభుత్వంతో చేసుకున్న మూడేళ్ల ఒప్పందం, అదనంగా మరో ఏడాది కలుపుకుని... ఈ ఏడాది మార్చితో నాలుగేళ్ల కాలం ముగియడం వల్ల గోఖలే తన సేవలకు స్వస్తి చెప్పారు. డాక్టర్ గోఖలే నిష్క్రమణ తరువాత హృద్రోగులు జీజీహెచ్ వైపు చూడటం మానేశారు .
డాక్టర్ గోఖలే వెళ్లిపోయిన తర్వాత గుండె సంబంధిత విభాగంలో సేవలందించేందుకు ప్రభుత్వం ముగ్గురు వైద్యులను నియమించింది. ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు పదిమంది టెక్నీషియన్లు, మూడు షిఫ్టుల్లో సిబ్బంది, సెక్యూరిటీ, శానిటరీ సిబ్బందితో మొత్తం 40మంది ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వారందరికీ కలిపి నెలకు సుమారు 20లక్షల రూపాయలు వేతనాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. మిషనరీ నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు అదనం. రోగులు మాత్రం ఆ వార్డు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా వస్తే పరీక్షలు జరిపి చికిత్స చేద్దామని వైద్యులు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇదే అదను అనుకున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు.....తమ వద్ద ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేస్తామంటూ కొందరు ఏజెంట్ల ద్వారా రోగులను తీసుకెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలను జీజీహెచ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా.....పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇస్తున్నారు..
గుంటూరు సర్వజనాస్పత్రికి గుండె లాంటి హృదయ సంబంధిత విభాగానికి పూర్వవైభవం తీసుకొచ్చి.... పేద రోగులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ప్రజలు కోరుతున్నారు.