జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. సర్వేశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, గ్రామ సర్వేయర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. విదేశాల్లో సివిల్ తగాదాల్లో భూములకు సంబంధించినవి 3శాతం లోపే ఉంటాయని.. మన వద్ద పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని కార్యక్రమానికి హాజరైన అజేయ కల్లం అన్నారు.
ప్రస్తుతం ప్రతి గ్రామానికి సర్వేయర్ ఉండటంతో భవిష్యత్లో భూ తగాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేయర్లు సక్రమంగా పని చేస్తే మిగతా శాఖల పని సులువవుతుందని రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి ఉషారాణి అన్నారు. రెవెన్యూశాఖ, సర్వే రెండు కళ్లలా పనిచేస్తే భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. అందుకే సర్వేయర్లు రెవెన్యూశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రాజెక్టులకు భూములు కేటాయించినా వాటిని ఇంకా రికార్డుల్లో మార్చకపోవటం సరికాదని... ఆ పని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్వేయర్లకు సూచించారు. రిజిస్ట్రేషన్ల విషయంలో మనం ఇంకా మెరుగుపడాలని సర్వే కమిషనర్ సిద్దార్థ జైన్ అన్నారు. సర్వే సేవలు ప్రజలకు సక్రమంగా అందాలని సూచించారు.
ఇదీ చదవండి: కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య.. తన అవయవాలు భార్యకు ఇవ్వాలని లేఖ