తెలుగు రాష్ట్రాల్లో బీసీలపై జరుగుతున్న దాడులపై విచారణ చేస్తున్నామని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. గుంటూరు ఆర్&బీ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో బీసీలపై దాడులు, అత్యాచారాలు, తప్పుడు కేసులు నిత్యకృత్యమయ్యాయని చెప్పారు. రొంపిచర్ల మండలంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన మనసును కలచివేసిందన్నారు. ఇంతవరకు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆగ్రహించారు.
అనపర్తి నియోజకవర్గంలో బీసీ యువకుడిపై అగ్రవర్ణాల వారు దాడి చేస్తే.. పోలీసులు కూడా స్పందించడం లేదన్నారు. బీసీల భూములు కబ్జా చేస్తున్నారని.. భూ రికార్డులు తారుమారు చేసి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరిగితే జాతీయ బీసీ కమిషన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
'రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గుతారా ?'
ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట గ్రామంలో కుమ్మరుల షెడ్లు కూల్చటంపై బీసీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చెరువు శిఖం కాబట్టి ఖాళీ చేయించామని రెవెన్యూ అధికారులు సమాధానమివ్వగా.. కుంటపై నుంచి జాతీయ రహదారి వెళ్ళింది. దాన్ని కూడా తొలగిస్తారా? అని కమిషన్ ప్రశ్నించింది. ఇది ప్రభుత్వం అధికారికంగా వారికి ఇచ్చిన భూమి అని.. వారు సకాలంలో పన్నులు కూడా చెల్లిస్తున్నారని తెలిపింది. ఎలాంటి పరిహారం చెల్లించకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎలా ధ్వసం చేస్తారని రెవెన్యూ అధికారులను బీసీ కమిషన్ నిలదీసింది. 'పేదవాళ్ళు, వృత్తిపనివారు కాబట్టి ఇలా చేస్తారా ? రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గుతారా ?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేపటి నుంచి యథావిధిగా కుమ్మరులు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించుకుంటారని.. అధికారులెవరూ అడ్డుచెప్పవద్దంటూ ఆదేశించింది. 15 రోజుల్లోగా స్వయంగా కలెక్టర్, ఎస్పీలు దిల్లీలోని బీసీ కమిషన్ కార్యాలయంలో నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: