ఎయిడెడ్ విద్యాలయాలను కొనసాగించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయడాన్ని నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్ గురువారం చలో అసెంబ్లీకి పిలుపునిస్తే అడుగడుగునా పోలీసులు అడ్డుకుని విద్యార్థి సంఘం నాయకులను స్టేషన్లలో కూర్చొబెట్టి ఇబ్బందులు పాల్జేశారని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన విద్యార్థులను మరుగుదొడ్ల వద్ద కూర్చొబెడతారా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా పెదకూరపాడు పోలీసు స్టేషన్ ముందు ఆయన విద్యార్థులతో కలిసి బైఠాయించారు.
ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా 8 గంటలకు పైగా అరెస్టు చేసి ఉంచడం ఏమిటని నిలదీశారు. అంతకు ముందు ఆయన అమరావతి పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఉన్న టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ తదితరులను పరామర్శించారు. లోకేశ్ వస్తున్నారనే సమాచారంతో పెదకూరపాడు స్టేషన్‌లో ఉన్న విద్యార్థి నాయకులను పోలీసులు అప్పటికప్పుడు వారిని అక్కడి నుంచి మరో స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నాయకులకు మధ్య పెనుగులాట జరిగింది.
ఇదీ చూడండి:
WEATHER UPDATE: పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు