వ్యవసాయంతో పాటు, గ్రామాల్లోని సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు అందించనున్నట్లు నాబార్డు ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయాన్ని గోవింద రాజులు కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయ నిర్వాహకులు గోవిందరాజులు దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది సుమారు ఏడున్నర లక్షల కోట్ల వ్యాపారం చేయాలని నిర్ణయించామన్నారు. నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగినందున.. ఈ ఏడాది వ్యవసారంగం మంచి లాభాలు వచ్చే అవకాశముందని చెప్పారు.
భూసారాన్ని సంరక్షించాలి..
దేశంలోని రైతులంతా భూసార సంరక్షణను మహా ఉద్యమంగా నిర్వహించాల్సిన తరుణం వచ్చేసిందని నాబార్డు ఛైర్మన్ డాక్టరు చింతల గోవిందరాజులు అన్నారు. అన్ని రాష్ట్రాల్లోని భూసార స్థితిగతులను పరిశీలిస్తే అతి తక్కువ ఆర్గానిక్ కార్బన్ ఉన్న దేశం భారతదేశమేనని చెప్పారు. పూర్వకాలం వినియోగించిన పశువుల ఎరువుల వినియోగాన్ని బాగా తగ్గించేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక క్వింటాలు ఆహార ధాన్యాలు పండించాలంటే క్వింటాలు యూరియా వినియోగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కేజీ యూరియాకి కిలో దిగుబడి..!
విజయవాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘం, వారాహి రైతు ఉత్పత్తదారుల కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఉత్పత్తదారుల కంపెనీల డైరెక్టర్ల సమావేశానికి నాబార్డు ఛైర్మన్ డాక్టరు చింతల గోవిందరాజులు, నాబ్‌కిసాన్ మేనేజింగ్ డైరెక్టరు సుశీల ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ నేలలు చచ్చుబడిపోయాయని అన్నారు. 1960- 70లో నీటిపారుదలతోపాటు యూరియాను పంటలకు అందించినప్పుడు ఒక కిలో యూరియాతో 14 కేజీల ఆహారధాన్యాల దిగుబడి వచ్చేదని.. ఇప్పుడు ఒక కిలో యూరియా వేస్తే 1.1 కిలో ఆహారధాన్యం పండుతోందని తెలిపారు. ఈ పరిస్థితి మారాలంటే రైతులు భూమిని సంరక్షించేందుకు అంతా చైతన్యలు కావాలన్నారు.
విచ్చలవిడిగా రసాయనాల వినియోగం..
బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా వినియోగించే దేశాలు పురుగు మందుల అవశేషాలున్నాయని మొత్తం బియ్యాన్ని వెనక్కి పంపేస్తున్నారని.. అందువల్ల బాస్మతి పంట వేసే రైతులకు అవగాహన కలిగించామని చెప్పారు. నాబార్డు ద్వారా ఎగుమతి కంపెనీలు, రైతులు, శాస్త్రవేత్తలతో ఏఫ్ పీవో ఏర్పాటు చేసి సరైన మెళుకువలను వివరించి- రసాయన మందులను విచక్షణ రహితంగా వినియోగించకుండా తగిన సూచనలు చేయడంతో ఇప్పుడు వారి పరిస్థితి మెరుగైందన్నారు.
ప్రోత్సహిస్తే ఫలితాలు..
రాష్ట్ర రైతులు వాణిజ్య పంటలతోపాటు సంప్రదాయ పంటలను కొంత భాగంలో పండించాలని సూచించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు వెళ్లిన వారిలో చాలా మంది వ్యవసాయం వైపు ఆసక్తి చూపిస్తున్నారని.. అలాంటి వారిని సంఘటితం చేసి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని చెప్పారు. ప్రతి రైతుకు గేదెలు, ఆవుల కొనుగోలుకు సహకార, గ్రామీణ బ్యాంకులు రాయితీపై రుణం అందిస్తున్నాయని అన్నారు. 200 మంది సభ్యులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే తక్కువ వడ్డీకి తాము రుణ సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నాబ్‌కిసాన్ ఎండీ సుశీల తెలిపారు. అన్ని బ్యాంకుల కంటే తాము తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి: