MP Raghu Rama Krishna Raju PIL on YCP Govt Corruption: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన బంధుగణం, వివిధ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై (Public interest Litigation) హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిల్‌లో ప్రతివాదులకు ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపేందుకు ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఆయన తరఫు న్యాయవాదికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
మరోవైపు వ్యక్తిగతంగా కూడా నోటీసులు అందజేసేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపేందుకు హైకోర్టు నిబంధనలే అనుమతిస్తున్నాయని గుర్తుచేసింది. కోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు అవసరం లేదని తెలిపింది. విచారణను వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన ప్రాథమిక కౌంటర్‌కు తిరుగు సమాధానం ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణరాజును ఆదేశించింది.
వైసీపీ నాలుగున్నరేళ్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్
అదే విధంగా ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy), ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), తదితరుల తరఫున వకాలత్ దాఖలు చేస్తున్నట్లు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. కౌంటర్ వేస్తామని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు కోసం ఎంపీ రఘురామ వేసిన పిల్‌పై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం, వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు జారీచేయడం ఉత్తమం అని అభిప్రాయపడింది.
ఇంకా 22 మందికి నోటీసులు అందాల్సి ఉంది: ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలను వినిపించారు. మొత్తం 41 మంది ప్రతివాదులలో ఇంకా 22 మందికి నోటీసులు అందాల్సి ఉందన్నారు. నోటీసులు అందనివారికి వ్యక్తిగతంగా, ఈ మెయిల్ ద్వారా వాటిని అందజేసేందుకు అనుమతివ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ వ్యాజ్య విచారణ అర్హతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎస్ కౌంటర్ దాఖలు చేశారని తెలిపారు. ఎంపీ రఘురామ సదుద్దేశంతో పిల్‌ను దాఖలు చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) జవహర్‌రెడ్డి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై పిటిషనర్ నిందలు వేస్తున్నారని అన్నారు. మీడియాతో ఎంపీ మాట్లాడిన వివరాలను కోర్టు ముందు ఉంచారు. పిల్‌ను కొట్టేయాలని కోరారు.