గుంటూరు సర్వజనాసుపత్రిలో ప్రాణవాయువు కోసం ఆదివారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి అధికార యంత్రాంగం మొత్తం ఆసుపత్రిలో ప్రాణవాయువు నిల్వలపైనే దృష్టి పెట్టారు. ట్యాంకర్‌లో నిల్వలు తక్కువగా ఉండటంతో.. ఎప్పుడు అయిపోతుందోనన్న భయంతో క్షణమొక యుగంలా గడిచింది. ఈ సమస్యను అధికారులు ముందుగా గుర్తించి పరిష్కారానికి అడుగులు వేశారు. విశాఖపట్నం నుంచి ప్రాణవాయువుతో బయల్దేరిన ట్యాంకర్ ఏలూరు రాగానే అక్కడినుంచి తొలిసారి గ్రీన్‌ఛానల్ ద్వారా... అంటే దారి మొత్తం ఎలాంటి వాహనాలు, సిగ్నళ్లు అడ్డు లేకుండా శరవేగంగా జీజీహెచ్‌కు వచ్చేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం దాటాక ఒకేసారి 11 కేఎల్ ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో 700 మందికి పైగా రోగులకు ఆక్సిజన్ అందించాల్సి ఉంది. వీరికి సమస్య లేకుండా చూసేందుకు ప్రత్యేకంగా ముగ్గురు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ముందస్తు ప్రణాళిక కలిసొచ్చింది
గత ఏడాది కరోనా బాధితుల సంఖ్య తక్కువగానే ఉన్నా.. ఆక్సిజన్ నిల్వ చేసుకునే ట్యాంకర్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిధులివ్వడంతో అదనంగా 20 కేఎల్ ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 30 కేఎల్ ఆక్సిజన్‌ను నిల్వ చేసుకునే సదుపాయం ఏర్పడింది. ట్యాంకర్ నుంచి వార్డులకు ప్రాణవాయువు సరఫరా చేసేందుకు కొత్త పైపులైను, ఎక్కడికక్కడ రెగ్యులేటర్లు ఏర్పాటుచేశారు. దీనివల్ల రోగికి ఎంత ఆక్సిజన్ అవసరమో అంతే అందిస్తున్నారు.
ఇదీ చదవండీ... నల్లబజారులో రెమ్‌డెసివిర్