అమరావతి రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదని.. రాజకీయ పాదయాత్ర అని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రైతులు చేపట్టిన ఉద్యమాన్ని తప్పుపడుతూ శ్రీదేవి పలు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఉద్యమం చేస్తున్నది నిజమైన రైతులే అయితే.. వారి సమస్యల పరిష్కారం కోసం తనను కలిసే వారని, అక్కడ ఉన్నది చంద్రబాబు బినామీలు అని అన్నారు. రెండేళ్లుగా ఉద్యమం చేస్తున్న వారిలో.. ఏ ఒక్కరూ తనను కానీ, తమ ప్రజాప్రతినిధులను కానీ కలవలేదన్నారు.
రైతులు వచ్చి సమస్యలు చెబితే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులతో చర్చించడానికి తాము, తమ అధినేత పలుమార్లు పిలిచినా ఎవరూ రాలేదన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహా పాదయాత్ర చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న పెట్టుబడి యాత్ర అని ఆరోపించారు. అమరావతి రైతులు పాదయాత్ర ఎందుకో చేస్తున్నారో.. ఎవరి కోసం చేస్తున్నారో.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు.
కోట్లాది రూపాయల భూములు కోల్పోతామనే భయంతోనే యాత్రలు చేపట్టారన్నారు. మూడు రాజధానుల అంశం కోర్టులో నడుస్తోందని.. అలాంటప్పుడు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అల్లర్లు, విద్వేషాలు రేపాలనే ఉద్దేశంతోనే పాదయాత్రలు చేపట్టారని ఆరోపించారు.
ఇదీ చదవండి: JAYANJTHI: గుంటూరులో పాటిబండ్ల సీతారామయ్య 139వ జయంత్యోత్సవం