Minister Talasani Says High level Meeting On Illegal Constructions In Hyderabad: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఈనెల 25న వివిధ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. అదేవిధంగా అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహిస్తామన్నారు. అగ్నిప్రమాదం జరిగిన భవనం వంటివి.. నగరంలో సుమారు 25వేలు ఉన్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. అయితే అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రికి తొలగించలేమని.. వాటిని ఏం చేయాలనే విషయంపై ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
అగ్నిప్రమాదంపై ప్రభుత్వ విభాగాలన్నీ వెంటనే స్పందించాయని.. అయితే భవనంలో కెమికల్స్ ఉన్నందున మంటలు త్వరగా అదుపులోకి రాలేదని వివరించారు. పక్కన బస్తీల ప్రజలకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. భవనం నాణ్యతపై వరంగల్ నిట్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టూరిస్టులా వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు.
డబ్బుల కోసం అక్రమ కట్టడాలను క్రమబద్దీకరిస్తున్నారన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతా రహితమని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనాన్ని కూడా క్రమబద్ధీకరించలేదని.. బీఆర్‌ఎస్‌పై హైకోర్టు స్టే ఉందన్న విషయం కిషన్‌రెడ్డికి తెలీదా అని గుర్తుచేశారు. ఇది రాజకీయాలకు సమయం కాదని.. గుజరాత్‌లో వంతెన కూలి 180 మంది మరణిస్తే తాము రాజకీయాలు చేశామా అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు.
భవనాన్ని పరిశీలించి కలెక్టర్: సికింద్రాబాద్ అగ్నిప్రమాద స్థలాన్ని కలెక్టర్ అమోయ్‌కుమార్ పరిశీలించారు. దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని డ్రోన్ కెమెరా ద్వారా నిశితంగా పరిశీలించి.. సమాచార సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. భవనం లోపల ఇంకా వేడిగానే ఉందని చెప్పారు. ఇప్పటికీ భవనంలోనికి వెళ్లలేకపోతున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ స్పష్టం చేశారు.
భవన యజమానిపై కఠిన చర్యలు: అలాగే సికింద్రాబాద్ అగ్నిప్రమాద సంఘటనలో నిబంధనలు ఉల్లఘించిన భవన యజమానిపై.. కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మధ్య మండలం డీసీపీ రాజేశ్ చంద్ర తెలిపారు. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి పూర్తి నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అలాగే భవనం కూల్చే వరకు చుట్టుపక్కల ఇళ్లలోకి ఎవరిని అనుమతించమని స్పష్టం చేశారు. లోపల మృతదేహాలు ఆనవాళ్లు గుర్తించేందుకు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నామని చెప్పారు. బిల్డింగ్ వెనుక భాగం పూర్తిగా దెబ్బ తినడం వల్ల.. లోపలకి వెళ్ళే పరిస్థితి లేదని వివరించారు. చుట్టూ పక్కల వారికి ఎలాంటి హాని కలగకుండా డిమలిషన్ ఏర్పాట్లు చేస్తున్నామని డీసీపీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు.
"ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడూ చూడలేదు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి కట్టడాలు 25 వేలు వరకు ఉంటాయి. ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేయాలని ఈ నెల 25వ తేదీన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలనుకుంటున్నాము. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి టూరిస్టులాగా వచ్చి గాలివాటం మాట్లాడుతున్నారు. అక్రమ కట్టడాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేయాలని కేంద్రానికి సీఎం, మున్సిపల్ మంత్రి లేఖ రాశారు. గుజరాత్‌లో వంతెన కూలిపోతే బీఆర్ఎస్ కూడా ఈ విధంగానే మాట్లాడిందా." - తలసాని శ్రీనివాసయాదవ్, రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి
ఇవీ చదవండి: