Minister Ambati Rambabu comments: పరిహారం సొమ్ము విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. పరిహారం సొమ్ములో లంచం తీసుకునే దౌర్భాగ్యం తనకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా తాను డబ్బు కోసం కక్కుర్తి పడినట్టు నిరూపిస్తే, రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తాను చేస్తున్న ఈ సవాల్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పర్లయ్య, గంగమ్మ దంపతుల కుమారుడు అనిల్.. ఈ ఏడాది ఆగస్టు 20న డ్రైనేజీ శుభ్రం చేసే పనికి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడి చనిపోతే.. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం మంజూరు చేయించింది నేనే. అలాంటిది శవాలపై పేలాలు ఏరుకోవాల్సిన అవసరం నాకు లేదు. కావాలనే తెదేపా, జనసేన పార్టీ నాయకులు నాపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. -అంబటి రాంబాబు, మంత్రి
ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో పర్యటించిన పవన్.. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వమిచ్చే పరిహారం డబ్బుల్లో ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో వ్యక్తులు లంచం డిమాండ్ చేశారంటూ మంత్రి అంబటి రాంబాబును పేరును ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఇవీ చదవండి