TDP Leader Dhulipala on Mining: సుద్దపల్లి క్వారీ వద్ద చేపట్టిన ఆందోళనను తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విరమించారు. అక్రమ మైనింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సుద్దపల్లి క్వారీని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కేవీ సత్యనారాయణ పరిశీలించారు. క్వారీలో కొలతలు తీసుకున్నారు. అక్రమాలు జరిగినట్లు నిరూపణ జరిగితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మళ్లీ మైనింగ్ జరగకుండా స్థానికులతో కమిటీ వేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధుల అండతోనే మైనింగ్..
ప్రజాప్రతినిధుల అండతోనే గుంటూరు జిల్లా సుద్దపల్లిలో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. దాదాపు వంద అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని తరలించేస్తున్నారని తెలిపారు. అక్రమంగా మైనింగ్ జరుగుతుందని స్థానికులు జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అక్రమంగా గ్రావెల్ తవ్వకాల్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఇక్కడ మైనింగ్ వ్యవహారాలపై ఆందోళన చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు తమ పార్టీ నేతలు చేస్తున్న అక్రమ తవ్వకాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ చేయవద్దని స్థానికులు కోరుకుంటున్నారని తెలిపారు. అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు పేర్కొన్నారు.
అక్రమ మైనింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాను. మళ్లీ మైనింగ్ జరగకుండా స్థానికులతో కమిటీ వేస్తామని అధికారులు తెలిపారు. ఒకవేళా అధికారులు తమ హామీలు విస్మరిస్తే ఇలాంటి పోరాటాలు మళ్లీ చేస్తా.-ధూళిపాళ్ల నరేంద్ర, తెదేపా సీనియర్ నేత
ఇదీ చదవండి:
సుద్దపల్లి క్వారీ వద్దే ధూళిపాళ్ల నరేంద్ర దీక్ష.. తెదేపా నేతల గృహనిర్బంధం