గుంటూరు జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇంకా వరద కష్టాలు తొలగలేదు. ప్రకాశం బ్యారేజి నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటం వల్ల పొలాలు ముంపులోనే ఉన్నాయి. జిల్లాలో 5 మండలాల్లో పరిస్థితి అలాగే ఉంది.
చేతికి అందొచ్చిన పంట నీట మునగడం వల్ల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పొలాల్లో నుంచి వరద పోతే గాని అధికారులు పంటనష్టం లెక్కలు వేసే పరిస్థితి లేదు. తీవ్రంగా దెబ్బతిన్నామని రైతులు వాపోతున్నారు.
కొల్లూరు మండలంలోని లంక గ్రామాలు సైతం ముంపు పరిధిలోనే ఉన్నాయి. మినుము, పసుపు, కంద, మిరప, వరిపైర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరటి తోటలు ముంపులో ఉన్నాయి. వరద తీవ్రతకు కొన్ని నేలకొరిగాయి. అలాగే ఎక్కువ రోజులు ఉంటే గెలలు పెరిగే అవకాశం ఉండదు. వరద ఎపుడు తగ్గుతుందా... అని రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షాల తీవ్రత ధాటికి గ్రామాల్లోని రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండటం వల్ల పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఇదీ చూడండి:
రాష్ట్రంలో వచ్చే నాలుగైదు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు