Marks Controversy in Acharya Nagarjuna University: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్కుల తారుమారు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 30 మంది విద్యార్థులకు చెందిన ప్రశ్నాపత్రాల్లో మార్కులు తారుమారు జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధ్యాపకులతో పాటు దినసరి ఉద్యోగులు కీలకపాత్ర పోషించినట్లు తెలిస్తోంది. ప్రశ్నాపత్రాల స్కానింగ్ దగ్గర ఈ వ్యవహారం వెలుగుచూసింది. అయితే, ఈ మార్కుల తారుమారు వ్యవహారంలో కొంతమంది దినసరి ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు.
ప్రశ్నాపత్రాల మూల్యాంకనను సక్రమంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం సీటీయే(చీఫ్ టీచర్ అసోసియేట్), ఏసీటీయేలను నియమించి, వారికి ప్రత్యేక వేతనం చెల్లిస్తుంది. అయినా పూర్తి స్థాయిలో ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించకుండా.. దినసరి ఉద్యోగులకు విడిచిపెట్టడంతో వారు ఆడిందే ఆటగా సాగుతోంది. బీఈడీ, పీజీ, బీటెక్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనలలోనూ ఇదే పరిస్థితి జరుగుతున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఏళ్ల తరబడి ఒకే స్థానంలో విధులు నిర్వర్తించడం వల్ల దినసరి ఉద్యోగులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన సమయంలో కొన్ని రోజులు ఆప్రాధాన్య స్థానంలో ఉంచి మూల్యాంకన చేయించినప్పటికీ మళ్లీ అదే స్థానానికి తీసుకొస్తున్నారు. మూల్యాంకన విభాగంలో పనిచేసే కొంతమంది దినసరి ఉద్యోగులైనా సీటీయే, ఏసీటీయేలు అజమాయిషీ చలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరంతా విశ్వవిద్యాలయంలో పనిచేసే ఇతర కీలక ఉద్యోగులకు బంధువులు కావడంతో చర్యలు తీసుకోవడానికి పై అధికారులు వెనుకాడుతున్నారు. తమకు ఉద్యోగుల అండ ఉందనే అండతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోయిందని, అన్ఎయిడెడ్ అధ్యాపకులను సైతం తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలోనూ ఓ ఉద్యోగిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆయనను మరో కళాశాలకు మార్చారు. ఒకే రోజులోనే వందల ప్రశ్నాపత్రాలను దిద్దిన ఘటనలున్నాయి. గతంలోనూ యూజీ పరీక్షల పత్రాల మూల్యాంకనంలో తప్పులు రావడంతో.. ఆ విభాగంలో రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలనే నిబంధన పెట్టారు. దీనిని పక్కనపెట్టి.. అతిథి అధ్యాపకులు, ఒప్పంద అధ్యాకులకు మూల్యాంకన బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీనివల్ల జవాబుదారీతనం లోపింస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూల్యాంకనానికి సంబంధించిన అనేక కీలక బాధ్యతలను ఒక్కరికే అప్పగించడంతో ఈ పర్యవేక్షణ నామమాత్రంగా మారింది. గతంలో బీఈడీ మూల్యాంకన బాధ్యతల నిర్వహణలో లోపాలు జరిగాయంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మార్కుల మార్పిడి వ్యవహారంలో అనుమానితుడిగా ఉన్న ఉద్యోగి విధులకు డుమ్మా కొట్టడంతో.. సదరు ఉద్యోగితో పాటు మరికొంతమంది మూల్యాంకన ఉద్యోగులను నియమించినట్లు సమాచారం.
ఇవీ చదవండి