Nagarjuna Sagar Canal Maintenance Works: నాగార్జున సాగర్ కాల్వల నిర్వహణ పనులు పడకేశాయి. కాల్వల మరమ్మతుకు నిధుల కొరత వెంటాడుతోంది. నిర్వహణ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తూటు కాడలు, పిచ్చిమొక్కలతో సాగర్ మేజర్, మైనర్ కాలువలు కళావిహీనంగా మారాయి. కొన్నిచోట్ల ఏళ్ల తరబడి కాల్వల నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో కాల్వల శివారు భూములకు సాగునీరందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
బడ్జెట్లో 2 కోట్లు మాత్రమే కేటాయింపు.. ఏటా చేపట్టే కనీస నిర్వహణ, మరమ్మతులకు కూడా గడిచిన నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా బడ్జెట్లో 2 కోట్లు మాత్రమే కేటాయించడం.. సొమ్ము నిల్వలు లేకపోవడంతో పనులు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. లక్షలాది ఎకరాలకు సాగునీరందించే కీలకమైన కాల్వలకు కనీస నిర్వహణ పనులు చేయకపోవడంతో కాలువలు అధ్వానస్థితికి చేరాయి. ఈ సారి మరమ్మతులు చేయకపోతే ఆయుకట్టు చివరి భూములకు సాగునీటి కష్టాలు తప్పవు. బ్రాంచి, మేజర్ కాల్వల్లో కొన్నిచోట్ల రివిట్మెంట్లు, సిమెంట్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
నీటి ప్రవాహం ముందుకు వెళ్లలేని పరిస్థితి.. మైనర్ కాల్వల్లో పిచ్చిమొక్కలు, తూటుకాడ పెరిగి నీటి ప్రవాహం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా ఉన్నత అధికారులు.. నిధులు లభ్యత ఆధారంగానే పనులు చేపట్టాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూడా పనులపై సందిగ్ధం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కుడికాల్వ పరిధిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఒంగోలు జిల్లాలున్నాయి. ఎడమ కాల్వ పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో సాగర్ కాల్వల ద్వారా తాగునీరు, సాగునీరు అందిస్తున్నారు. డివిజన్లలో ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో కాలువలను పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేసి జలవనరుల శాఖ ముఖ్య ఇంజనీర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు.
సుమారు 37 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపగా.. ఇందులో ఇప్పటివరకు 3.47 కోట్ల రూపాయల విలువైన పనులకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. సాగర్ కాల్వలకు నీటి ప్రవాహం లేని మే, జూన్ నెలల్లో పనులు చేయడానికి అనువైన సమయం. సాగర్ జలాశయానికి వరదనీటి చేరిక, నీటి లభ్యత ఆధారంగా జులై నుంచి ఎప్పుడైనా పంటలకు నీటిని విడుదల చేస్తారు. అయితే మే నెల చివరకు వచ్చినా నిధుల లభ్యతపై సందిగ్ధం కొనసాగుతుండటం, అనుమతించిన పనులకు టెండర్లు పిలవలేని పరిస్థితుల్లో ఈ ఏడాది కాల్వల మరమ్మతులపై నీలినీడలు అలుముకున్నాయి.
శివారు భూములకు నీరందని పరిస్థితి.. లక్షల ఎకరాలకు సాగునీరందించే కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేజర్, మైనర్ కాలువల పరిస్థితి దయనీయంగా మారిందని.. ఎప్పుడైనా పైనుంచి నీరిచ్చినా కాల్వల్లో అడ్డంకులు వల్ల శివారు భూములకు సాగునీరందే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. సుమారు ఏడు, ఎనిమిదేళ్ల నుంచి మైనర్ కాల్వలకు మరమ్మతు చేయలేదని రైతులు చెబుతున్నారు. సాగర్ కాల్వలపై ఆధారపడి లక్షలాది ఎకరాల ఆయుకట్టు, వేలాదిమంది రైతులున్నందున ప్రభుత్వం సరిపడా నిర్వహణ నిధులు విడుదల చేసి.. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన అవసరముంది.
ఇవీ చదవండి: