రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పండుగ సందర్భంగా ప్రముఖ క్షేత్రాల్లో శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు.
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా మహానందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మహానందీశ్వర స్వామి ఉత్సవ మూర్తికి పలు వాహన సేవలు నిర్వహించారు. ఈ క్రమంలో స్వామివారికి గత రాత్రి వ్యాఘ్ర వాహన సేవ నిర్వహించారు. ఇవాళ అశ్వవాహన సేవ, సాయంత్రం గజ వాహన సేవలు జరగనున్నాయి.
విశాఖ జిల్లా
విశాఖ జిల్లా పద్మనాభం మండలం విలాస్కానిపాలెంలో ఏటా మాఘ పౌర్ణమి తర్వాత శివరాత్రి ముందు వచ్చే ఏకాదశి రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తుంటారు. గ్రామానికి చెందిన బొగత శ్రీను అనే వ్యక్తి రామలింగేశ్వర స్వామి ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వేదమంత్రాలు, వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది.
కడప జిల్లా
కడప జిల్లా రాజంపేట సమీపంలోని పవిత్ర బహుదా నదీ తీరంలో కొలువైన త్రేతేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 21న వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. 22న స్వామివారి కళ్యాణ మహోత్సవం, 23న రథోత్సవం, బండలాగుడు పోటీలను ఆలయాధికారులు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లా
మహాశివరాత్రిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలను సుందరంగా అలంకరించారు. ఏలేరు నదిలో పుణ్య స్నానాలు అచరించే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాల వద్ద 'ఈటీవీ' సిబ్బంది ఏర్పాటు చేసిన 'ఈటీవీ భారత్' యాప్ ప్లెక్సీలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
గుంటూరు జిల్లా
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 21న జరగనున్న తిరునాళ్ల మహోత్సవానికి కోటప్పకొండ ముస్తాబవుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తారు. తిరునాళ్లకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు.
108 శివలింగాల ఏర్పాటు
వినుకొండ శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మ కుమారీలు మహాశివరాత్రి సందర్భంగా 108 శివలింగాలను స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. మొదటి రోజు అష్టలక్ష్మి అలంకరణ, రెండోరోజు శ్రీ వెంకటేశ్వరస్వామి చైతన్య అలంకరణ, మూడో రోజు కైలాసగిరి అలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమవాసులు తెలిపారు.