Shivratri Celebrations in Kotappakonda: రాష్ట్రంలోని శైవక్షేత్రాల్లో గుంటూరు జిల్లాలోని కోటప్పకొండది ప్రత్యేకస్థానం. గొప్ప ఆధ్యాత్మిక , పర్యావరణ ప్రాంతంగా త్రికోటేశ్వరాలయం గుర్తింపు తెచ్చుకుంది. 1700 ఏళ్లుగా సిద్ధ క్షేత్రంగా పూజలందుకుంటున్న ఈ కొండపై శివయ్య... త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. ఈశ్వరుడు... మేధా దక్షిణామూర్తి స్వరూపముగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతోంది. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీవియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి పర్వతంపై తపమాచరించుచుండగా.... బ్రహ్మ, విష్ణువులు, సకల దేవతలు స్వామివారి కటాక్షానికి ఇక్కడకు వచ్చారని భక్తుల విశ్వాసం.
పర్యాటకులను కట్టిపడేసే ప్రకృతి అందాలు...
కోటప్పకొండ దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వరస్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్రశిఖరంపై పాతకోటేశ్వరస్వామి క్షేత్రం, విష్ణుశిఖరంపై పాపవిమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధా దక్షిణమూర్తి ఆలయం, నాగేంద్రస్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతియాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులకు సరికొత్త అనుభూతుల్ని పంచుతాయి. సహజ సిద్ధ ప్రకృతి అందాలకు నిలయమైన పచ్చటి కొండలు... పర్యాటక ప్రేమికుల్ని కట్టిపడేస్తాయి.
ఆధ్యాత్మిక భావనతో పాటు ఆహ్లాద వాతావరణం...
కోటప్పకొండ శివరాత్రి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. శివరాత్రి, కార్తీకమాసం వంటి పర్వదినాల్లోనే కాకుండా ఏడాదంతా భక్తులు కొండకు వచ్చేలా పలు అభివృద్ధి పనులను చేపట్టారు. కొండ దిగువభాగంలో పిల్లలపార్కు, కాళింది మడుగు, బోటుషికారు వంటివి ఏర్పాటు చేశారు. వివిధ రకాల జంతువులు, పక్షులతో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శన శాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అటవీశాఖ అరుదైన చేపలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. కొండకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావనతో పాటు ఆహ్లాద వాతావరణాన్ని చేరువ చేస్తోంది.
కోటప్పకొండ ప్రత్యేకత ఏంటంటే...
శివరాత్రి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది కోటప్పకొండకు తరలివస్తారు. ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది వరకు భక్తులు రావొచ్చని అంచనా. అందుకు తగ్గట్లుగానే అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 490 బస్సులను నడపనున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా 2,700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు 70 నుంచి 100 అడుగుల ఎత్తైన విద్యుత్ ప్రభలతో తరలిరావడం కోటప్పకొండ ప్రత్యేకత. వెలుగులు విరజిమ్మే ఈ ప్రభల నడుమ కోటప్పకొండలో శివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతాయి.
ఇదీ చదవండి: sri sailam:బ్రహ్మోత్సవం.. శ్రీశైల మహోత్సవం