లారీల దొంగ తనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు. నరసరావుపేటకు చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి స్థానిక కోటప్పకొండ రోడ్డులో రూ. 5 లక్షలతో ఒక లారీ కొనుగోలు చేసి ఇసుక వ్యాపారం చేస్తున్నాడన్నారు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోవడంతో.. వ్యాపార సంస్థ వద్ద నిలిపి ఉంచిన లారీని గత నెల 28న దుండగులు అపహరించారు.
ఘటనపై యజమాని తిరుపతిరావు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు సీఐ కృష్ణయ్య, ఎస్సై రబ్బానీ, సిబ్బంది.. సాంకేతికతను వినియోగించి దర్యాప్తు చేపట్టి వినుకొండ సమీపంలోని ఏనుగుపాలెం వద్ద ఉన్నట్లు గుర్తించారు.
లారీ చోరీకి పాల్పడ్డ నిందితులు.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంకానికి చెందిన ఆచంట గంగాధర్, వెంకటేశ్వరరెడ్డి లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు గంగాధర్ 2010 నుంచి ముఠాను ఏర్పాటు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా 31 లారీలను దొంగిలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇలా చోరీ చేసిన లారీలను హైదరాబాదుకు తరలించి విడిభాగాలుగా మార్చి అమ్మేవారని పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇవీ చదవండి: