పూలమ్మినచోటే పస్తులుండటం అంటే ఇదేనేమో. కరోనా ప్రభావంతో అన్నిరంగాల మాదిరిగానే పూలవ్యాపారం దారుణంగా దెబ్బతింది. దీనిపైనే ఆధారపడిన వ్యాపారులు, కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంటూరు జిల్లాలో ఇప్పటికే పూలరైతులు పెద్దఎత్తున నష్టపోగా... దుకాణదారులదీ అదే పరిస్థితి. వేల రూపాయల్లో అద్దెలు కట్టి... దుకాణాలు నిర్వహిస్తుండగా లాక్‌డౌన్ ప్రభావంతో మూడు నెలలుగా వ్యాపారం పడకేసింది. ఇప్పటికీ కొన్నిప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోలేదు. కరోనా వైరస్ దెబ్బకు పూలు మిగిలిపోయి. మరునాటికి పాడైపోవడంతో రోజూ రెండింతల నష్టం వాటిల్లుతోంది. అవసరమైతే తప్ప ఎవరూ పూలమార్కెట్ వైపు రావడం లేదు. దీనికి తోడు లాక్‌డౌన్ ఆంక్షలు వ్యాపారానికి ప్రతిబంధకంగా మారాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో వ్యాపారులు సహా అక్కడ పనిచేసే మహిళలు, కూలీల ఉపాధికి గండిపడింది. ఒక్కో దుకాణంలో ఆరుగురు పనిచేసేచోట ఇద్దరికే పని దొరుకుతుంది. యజమానులే కొందరు వర్కర్లకు అప్పులు లేదా అడ్వాన్సులు ఇచ్చి నెట్టుకొస్తున్నారు. తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్నామని... వేరే పనులకు వెళ్లలేక.. ఉపాధిలేక.. నష్టాలు భరించలేక ఇబ్బందులు పడుతున్నామని వాటిపై ఆధారిపడిన వారు చెబుతున్నారు.
ఇదీ చదవండి: