తెదేపా అధినేత చంద్రబాబునాయుడిపై గుంటూరు, నరసరావుపేటల్లో రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...జిల్లా కోర్టు న్యాయవాది పచ్చల అనిల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై గుంటూరులోని అరండల్‌పేట ఠాణాలో మంగళవారం కేసు నమోదైంది. కరోనా వైరస్ సెకండ్‌వేవ్‌లో భాగంగా కర్నూలు జిల్లాలో ఎన్ 440కే వేరియంట్ ఉద్భవించిందని, ఇది 10 నుంచి 15 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైందంటూ బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు చేసిన తప్పుడు ప్రకటన ప్రజల్లో మానసిక వేదన, అధైర్యం కలిగించిందని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్ 440కె వేరియంట్ ప్రమాదకరమైంది కాదని సీసీఎంబీ నివేదిక పేర్కొన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయాందోళనలకు గురి చేసేలా ఉన్నాయని ఇచ్చిన ఫిర్యాదు మేరకు 188, 505(1)బి, 505(2), ఐపీసీ సెక్షన్ 54 డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేతలిద్దరూ కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పట్టణానికి చెందిన న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై మంగళవారం కేసు నమోదు చేశామని సీఐ కృష్ణయ్య తెలిపారు. ఇదే ఆరోపణలపై కర్నూలు జిల్లాలో ఇటీవల చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: