Digital Farming In Lam Farm : గుంటూరుకు సమీపంలోని లాం ఫాం వందేళ్ల ఉత్సవాలకు సిద్ధమైంది. గుంటూరు నుంచి అమరావతి వెళ్లే ప్రధాన మార్గంలో ఈ పరిశోధన కేంద్రం ఉంది. 1922లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం పేరిట 300 ఎకరాల విస్తీర్ణంలో బ్రిటీష్ పాలకులు దీనిని ఏర్పాటు చేశారు. అప్పటి వర్షాభావ పరిస్థితుల్లో మెట్ట పంటలను పండించటానికి ఈ కేంద్రం ఆసరాగా నిలిచింది. నాటి నుంచి స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు, పశుపోషణ ప్రయోగాలకు కేంద్రబిందువుగా నిలిచింది.
ఎన్నో కొత్త రకాల వంగడాలు : చిరుధాన్యాల నుంచి పొగాకు, అపరాలు, మిరప, ప్రత్తి, వరి తదితర పంటలపై ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ఒంగోలు జాతి పశువుల పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించి కూడా ఈ కేంద్రం పని చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాక లాం ఫాంను దాని పరిధిలోకి తెచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. లాం ఫాంలో జరిగిన పరిశోధనలు ఎన్నో కొత్త రకాల వంగడాలకు పురుడు పోశాయి. వరిలో పేరుగాంచిన సాంబామసూరి, స్వర్ణ రకాలు ఇక్కడ తయారైనవే. దేశంలో మూడో వంతు సాగయ్యే వరి రకాలు మనవేనని ఇక్కడి అధికారులు ఘనంగా చెబుతున్నారు.
డిజిటల్ వ్యవసాయం : గుంటూరు సన్నాలు, 334 పేరుతో మిరప, 52 అనే కంది, మినుములో ఎల్.బీజీ-17, పెసరలో ఎల్.జి.జి 460 రకాలు రైతుల మన్ననలు పొందాయి. సోయాబీన్‌పై కూడా ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ప్రత్తిలో వైరస్, తెగుళ్ల నివారణకు కాండానికి మందు పూత ప్రయోగం ఇక్కడే జరిగింది. ఇప్పటివరకు ప్రత్తి, మిరప, అపరాలు, చిరుధాన్యాలు, సోయాబీన్ లో సుమారు 74 రకాల వంగడాలు లాం ఫాంలో తయారయ్యాయంటే కొత్త రకం విత్తనాల తయారీ, రైతన్నల వ్యవసాయ దిగుబడులు పెంచటంలో లాం ఫాం సమర్థతకు నిదర్శనం. డిజిటల్ వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలను కూడా ఈ కేంద్రంలో ప్రారంభించారు. దేశంలో 70 వ్యవసాయ విశ్వ విద్యాలయాలుండగా.. కిసాన్ డ్రోన్ శిక్షణకు సంబంధించి డీజీసీఏ నుంచి అనుమతి పొందిన ఏకైక కేంద్రంగా పేరుగాంచింది.
ఆర్ధికంగా నిలదొక్కుకోగలిగామన్న రైతులు : గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వ్యవసాయ ముఖచిత్రం మారటానికి లామ్ పరిశోధన స్థానం ఎంతగానో దోహదపడింది. జొన్న, సజ్జ, రాగులు వంటి చిరుధాన్యాలను పండిస్తున్న పరిస్థితి నుంచి వరి, అపరాల వంటి ఆహార పంటలు, మిరప, ప్రత్తి లాంటి వాణిజ్య పంటలు సాగుచేసేలా రైతులు ఎదగ గలిగారు. ఇక్కడి పరిశోధనల కారణంగా ఆర్ధికంగా నిలదొక్కుకోగలిగామని రైతులు చెబుతున్నారు.
లాంఫాం ముద్ర : రాష్ట్రంలో వ్యవసాయంలో బలమైన పునాదుల్ని వేయటంలో లాంఫాం తనదైన ముద్ర వేసిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇవీ చదవండి