Kodi Katti Case Updates: కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ పలు అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నేరాభియోగపత్రం దాఖలు చేసిందని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో వాదనలు వినిపించారు. నిష్పక్షపాతంగా తిరిగి విచారిస్తే కుట్ర కోణం వెలుగులోకి వస్తుందని కోర్టుకు తెలిపారు. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో కోడికత్తి కేసులో మంగళవారం నాడు వాదనలు జరిగాయి. సీఎం జగన్ తరపు న్యాయవాది అభ్యర్ధన మేరకు ఈ విచారణ అంతా ఇన్-కెమెరా పద్ధతిలో సాగింది.
కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు నేరచరిత్ర ఉన్నా.. విమానాశ్రయ క్యాంటీన్ నిర్వాహకుడు హర్షవర్దన్, దీనిని పట్టించుకోకుండానే విధుల్లోకి తీసుకున్నారని జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అతను 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గాజువాక టికెట్ ఆశించారని.. అతని పాత్రపై ఎన్‌ఐఏ విచారించలేదని న్యాయవాది వాదించారు. నిందితుడు 2017లో జగన్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ వేసిన ఫ్లెక్సీపైనా దర్యాప్తు చేయాలన్నారు.
అనంతరం ఎన్‌ఐఏ, నిందితుడి తరఫు వాదనలు వినిపించేందుకు వీలుగా కేసును న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున అతని న్యాయవాది సలీం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు గత ఐదేళ్లుగా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడని, ఎన్‌ఐఏ విచారణ ఇప్పటికే పూర్తి అయిందన్నారు. ఈ దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై కోర్టు విచారణ చేసి, నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అడ్వకేట్ సలీం తెలిపారు.
కోడికత్తి దాడిలో ఎటువంటి కుట్ర లేదు: ఇక కోడికత్తి కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఏడాది ఏప్రిల్ 13న విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని, పథకం ప్రకారమే దాడి జరిగిందన్న జగన్ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్‌కు.. తెలుగుదేశం పార్టీతోనూ, దాడితోనూ సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది. సమగ్ర విచారణ తర్వాతే ఈ విధమైన నిర్ధారణకు వచ్చామన్న ఎన్‌ఐఏ.. తదుపరి దర్యాప్తు అవసరం లేదని, జగన్ పిటిషన్లు కొట్టేయాలని కోర్టును కోరింది. అలాగే దాడికి కొన్ని రోజుల ముందు నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదన్న జగన్ అభియోగం కూడా ఎంతమాత్రం నిజం కాదని, సీసీటీవీ కెమెరాలన్నీ పనిచేస్తున్నట్లు తేల్చింది. విమానాశ్రయంలో సీసీటీవీ దృశ్యాలను పూర్తిగా విశ్లేషించామని ఎన్‌ఐఏ తెలిపింది.