Intintiki Jagan Anna: నాలుగేళ్ల వైసీపీ పాలన రాష్ట్రానికి శాపమని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో వ్యాఖ్యానించారు. సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేదం, ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం ప్రాజెక్టు, ఇసుక సరఫరా ఇలా అన్ని విషయాల్లో ఎన్నికల ముందోమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక అన్నింటా నమ్మక ద్రోహం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లల్లో రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయకుండా ప్రజలకు నమ్మక ద్రోహం చేసింది వాస్తవం కాదా అన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణం పేరిట భూ సేకరణ కోసం భారీగా అక్రమాలకు పాల్పడ్డారని... దీనిపై సీబీఐ విచారణ చేయించే దమ్ముందా అని సవాల్ విసిరారు.
పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే రైతుల జీవితాలు బ్రహ్మాండంగా ఉంటుందన్న జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి అన్యాయం చేశారని కన్నా ఆరోపించారు. మద్యపానం నిషేధిస్తానని చెప్పి జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ మద్యం అమ్మకాలుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతున్నారని కన్నా వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. వ్యవసాయ మోటర్లుకు విద్యుత్ మీటర్లు బిగించి రైతులు ఉరితాడు వేశాడని ఆరోపించారు. ఆ మీటర్ల పేరు మీద సైతం జగన్ దోచుకుంటున్నాడన్నారు. మహారాష్ట్రలో విద్యుత్ మీటర్ల ధర రూ.18వేలు ఉంటే, అదే మీటర్ల ధర ఆంధ్రప్రదేశ్లో మాత్రం రూ.30వేల వరకు ఉందని వెల్లడించారు.
పేదలకు గృహనిర్మాణం పేరుతో సీఎం జగన్, ఎమ్మెల్యేలు... పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పేదలకు కట్టే ఇళ్ల కోసం భూమి సేకరణలో అవినీతి జరిగిందని కన్నా అరోపించారు. ఇదే విషయాన్ని వైసీపీ నుంచి బయటికి వచ్చిన ఎమ్మెల్యేనే గుర్తుకు చేశారని వెల్లడించారు. ఇళ్ల పేరుతో జరిగిన మోసంపై సీబీఐ విచారణ చేసేందుకు వైసీపీ సిద్ధమా అని కన్నా ప్రశ్నించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే వారందరికీ అమ్మఒడి డబ్బులు ఇస్తానని చెప్పిన జగన్ ఆ తరువాత ఒక్కరికే అంటూ విద్యార్థులను సైతం మోసం చేశాడని ఎద్దేవా చేశారు. కాంట్రక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానన్న హామీ ఇచ్చిన జగన్ వారిని సైతం మోసం చేశాడని కన్నా పేర్కొన్నాడు. పేదకు సంక్షేమ పథకాలు అందించే పేరుతో ఇప్పటి వరకు రూ.9 లక్షల కోట్ల అప్పు తెచ్చాడని వెల్లడించారు. సంక్షేమం పేరుతో పెట్టిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కన్నా డిమాండ్ చేశారు. వైసీపీ ఈ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కు వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఇంకా ఏ అర్హత ఉందని ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు వేస్తున్నారని కన్నా ప్రశ్నించారు.
ఇవీ చదవండి: