Pothina Mahesh on Hajj Yatra: హజ్ యాత్రికుల 83వేల రూపాయల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్తే.. 3లక్షల 5వేల రూపాయల ఖర్చు అవుతుందని, అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే.. 3లక్షల 88వేల రూపాయల ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. దీనివల్ల మక్కాకు వెళ్లే.. ముస్లింలకు 83వేల రూపాయల అదనపు భారం పడుతుంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే.. హజ్ కమిటీ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తగ్గిస్తుందో తెలియదు కాబట్టి ఈ 83వేల రూపాయలను భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు అయినా సరే హజ్ యాత్రకు వెళ్లేటప్పుడు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు నుంచే వెళ్లాలి అనే నిబంధన వలన ముస్లిం మైనార్టీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గన్నవరం నుంచి వెళ్లకపోతే ప్రభుత్వం ఇచ్చే 60 వేల రూపాయల ఆర్థిక సాయం నిలిపివేస్తామని బ్లాక్మెయిలింగ్ విధానం వలన హజ్ యాత్రలో అదనపు భారాన్ని భరించలేక సతమతమవుతున్నారని ఆయన అన్నారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలతో ఫొటోలు దిగి ప్రచారం చేసుకునేందుకే ఈ నిబంధనను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందా? అని ఆయన ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి గురించి పదే పదే దిల్లీ వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయరా? అని ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి నిబంధన మన రాష్ట్రంలోని ముస్లింలకు మాత్రమే ఎందుకు? అని ఆయన నిలదీశారు. ఈ ప్రశ్నకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందాలంటే గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లాలా? లేకుంటే నగదును ఇవ్వరా..? ఇదేం రూల్..? అని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక సాయం పేరుతో అడ్డగోలు నిబంధనలు పెట్టి ముస్లింల మక్కాయాత్రకు ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆయన అన్నారు. గత ఏడాది మక్కాను సందర్శించిన 102 మందికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించలేదని ఆయన తెలిపారు.
"ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలి అనుకునే ముస్లింలకు జగన్ సర్కారు అనేక ఇబ్బందులను సృష్టిస్తోంది. తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్తే.. 3లక్షల 5వేల రూపాయల ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే.. 3లక్షల 88వేల రూపాయల ఖర్చు అవుతుంది. దీనివల్ల మక్కాకు వెళ్లే.. ముస్లింలకు 83వేల రూపాయల అదనపు భారం పడుతుంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. తగిన ఏర్పాట్లు చేయాలి" - పోతిన మహేశ్, జనసేన అధికార ప్రతినిధి
ఇవీ చదవండి: