Jada Sravan on illegal Arrests: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతికి తావు లేకుండా, ప్రాథమిక హక్కులకు భంగం లేకుండా పరిపాలన అందిస్తానని చెప్పిన మాటలు ఇప్పటికీ తన చెవుల్లో మారుమోగుతున్నాయని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. కానీ ఇప్పుడు మాట తప్పి.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ జగన్ పరిపాలన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్ పాలన చూస్తుంటే సిగ్గుగా ఉందని.. వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ పరిపాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉండటం తమ ప్రాథమిక హక్కు అని.. అమరావతి రైతుల తరఫు న్యాయం కోసం అమరావతిలో దీక్షకు పూనుకుంటే పోలీసులతో భగ్నం చేస్తారా అని జడ శ్రవణ్ ప్రశ్నించారు.
ఎవరి భూమిని ఎవరికి పంచుతారు: పేదలపై జగన్కు, వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్థలంలో 5 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులతో తమ దీక్షను అడ్డుకున్నప్పుడే ఈ ప్రభుత్వం పిరికిపందగా మారిందని ఎద్దేవా చేశారు. అమరావతి రైతుల తరపున పోరాడుతానని.. ఈరోజు తన దీక్షకు మద్దతుగా తుళ్లూరు శిబిరం వద్దకు తరలివచ్చిన మహిళలకు, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజల భవిష్యత్ అని.. అమరావతిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చే హక్కు తమకు లేదా అని శ్రవణ్ ప్రశ్నించారు.
అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ఈరోజు తమ అక్రమ అరెస్టులు నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, నిరసనలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. జగన్ పల్లకిని మోసిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు.. నేడు అదే జగన్ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆధిపత్యం చెలాయించుకునే సమయం కాదనే విషయాన్ని రాజధాని రైతులు తెలుసుకోవాలని శ్రవణ్ సూచించారు. ఏ పార్టీ మద్దతిచ్చినా తీసుకోవాలని రైతులను కోరుతున్నట్లు తెలిపారు. భూములను రక్షించుకోవాలంటే కులమతాలకు అతీతంగా పోరాడాలని సూచించారు. అన్ని వర్గాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
అమరావతి రైతులకు మద్దతు కూడగట్టేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తాం.. కాచుకోండి అని సవాల్ విసిరారు. ఈ నెల 26న జరుగబోయే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే సామాజిక మాధ్యమాల ద్వారా నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ స్మృతి వనానికి వెళ్తానని.. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకొని పాదయాత్ర, దీక్ష చేపట్టనున్నట్లు శ్రవణ్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: