TDP Chief Chandrababu Fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సాగును చంపేసి.. రైతన్నను ముంచేశాడంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ రైతుకు ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని.. అలాగే ఏపీలో వెంటిలేటర్లు మీదున్న రైతును ఆరోగ్యవంతుడ్ని చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో నూతన వ్యవసాయ విధానం ప్రకటిస్తామని తెలిపారు. రైతు బతకాలంటే జగన్ పోవాలని అన్నారు. వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పుండు మీద కారం చల్లేలా రైతుల పట్ల జగన్ చర్యలున్నాయని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్నదాత ఆక్రందన పేరిట మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
Chandrababu on Ganja: రాష్ట్రంలో గంజాయి పంట మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలో ఉన్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయే అని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కేసులు.. వనరుల దోపిడీనే జగన్ పాలన అని విమర్శించారు. రైతన్న నేడు వెంటిలేటర్‌పై ఉన్నాడని.. 4 ఏళ్లలో 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 93శాతం రైతులు అప్పులు పాలయ్యారని, రైతుపై సగటు అప్పు 2.45 లక్షల పైనే ఉందని అన్నారు. నష్టపోయిన రైతులకు ఇచ్చింది అరకొర సాయమేనని ఆరోపించారు. భూమి అమ్మేద్దాం అనుకుంటే, ధర కూడా లేదని అన్నారు. చేతకాని అసమర్థ ప్రభుత్వం వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని చంద్రబాబు దుయ్యబట్టారు.
రైతుపై ప్రేమ, అవగాహన, బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పంట వేసిన రైతైనా బాగున్నాడా అని నిలదీశారు. రాష్ట్రంలో ఇంకా లోటు వర్షపాతం ఉంటే ఇంతవరకు కనీస సమీక్ష కూడా చేయలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని అన్నారు. వ్యవస్థల్ని చంపేసి రివర్స్ గేర్‌లో నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో రైతు ఒక్కడే బయటకు వచ్చి దేశానికి అన్నం పెట్టాడన్నారు. ఈ సంక్షోభానికి కారణమైన జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే అర్హత ఎక్కడిదని నిలదీశారు.
Chandrababu on Farmers Problems: కర్నూల్లో పత్తి, సీమలో వేరుశెనగ రైతు, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతు.. ఉత్తరాంధ్ర జీడి రైతు.. ఒక్కరైనా బాగున్నారా అంటూ ప్రశ్నించారు. సీమలో హర్టికల్చర్.. కోస్తాలో ఆక్వా కల్చర్‌కు తమ హయాంలో ప్రాధాన్యం ఇచ్చామన్న ఆయన.. ఇప్పుడు ఆ రెండు రంగాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు. చేతగాని ప్రభుత్వం ఉంటే రైతులు ఎలా నష్టపోతారోననేది నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనమన్నారు. ధాన్యం రైతుకి గిట్టుబాటు ధరలు లేవని, ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. సమస్యలు చెప్పుకునే రైతులను మంత్రి ఎర్రిపప్పలంటూ నిందిస్తాడని చంద్రబాబు ఆక్షేపించారు. తెలుగుదేశం హయాంలో 23 వేల ట్రాక్టర్లు ఇచ్చామని.. ఇప్పుడు 6 వేల ట్రాక్టర్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. సూక్ష్మ పోషకాలు ఇవ్వడం లేదని, భూసార పరీక్షల్లేవని.. పంటల దిగుబడి తగ్గిందని తెలిపారు. నీటి సెస్ వెయ్యి లీటర్లకు 12 నుంచి 120 చేశారన్నారు. కృష్ణా-గోదావరి నదులున్న ఆంధ్ర రాష్ట్రంలో నీటిపై విపరీతమైన సెస్సులా అంటూ మండిపడ్డారు.
Chandrababu on AP Debts: రైతులపై అప్పుల భారం మోపి, జగన్మోహన్ రెడ్డి మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. టమాట పంటలేయడం మానేశారన్న ఆయన.. ఇప్పుడు టమాట ధరలు పెరగడానికి ఇదే కారణమని తెలిపారు. ముందు చూపుతో వ్యవహరిస్తే.. ఈ తిప్పలు ఉండేవి కావని హితవుపలికారు. సీఎం జగన్‌కు ముందు చూపు లేదని.. ఎప్పుడూ పక్క చూపులు.. అడ్డం చూపులేనంటూ మండిపడ్డారు.
Chandrababu on AP Capital: దౌర్భాగ్యం కలిసొచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని, రైతు నాశనమయ్యాడని అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధానిలో రైతుల భూమిని వేరొకరికి దానం చేసిన జగన్మోహన్ రెడ్డి దానకర్ణుడా అంటూ నిలదీశారు. అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా అంటూ ప్రశ్నించారు. అమరావతి ప్రజా రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి కోర్టుల్లో అనుమతి వచ్చిందా అని నిలదీశారు. ఏపీ రాజధాని ఏదీ అంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులపై జగనుకు ఎందుకు కక్ష అంటూ ప్రశ్నించారు. రైతులకు కులాలా అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.