Jagan Government Neglect of Free Crop Insurance: కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పోర్టల్‌లో ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరఫున నమోదైన వివరాలు నివ్వెర పరుస్తున్నాయి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సీజన్ మొత్తంలో సాగైన పంటల విస్తీర్ణం 0.04 హెక్టార్లేనా, పంట పండిస్తున్న రైతులు 16 మందే అంటూ జగన్ సర్కారు చెబుతోంది. నిజానికి ఈ ఏడాది ఖరీఫ్‌లో 60లక్షల మందికిపైగా రైతులు 93 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు ఈ-క్రాప్‌లో నమోదైంది. ఇందులో ఉచిత పంటబీమా ఎంత విస్తీర్ణానికి వర్తిస్తుందో, బీమా లేని విస్తీర్ణమెంతో ప్రశ్నార్థకమే. బీమా చేసిన విస్తీర్ణం లెక్కల్ని కేంద్రం బీమా పోర్టల్‌లో నమోదు చేయకపోవడంతో ప్రస్తుత మిగ్‌జాం తాకిడితో దెబ్బతిన్న తమ పంటలకు బీమా వర్తిస్తోందో లేదో అనే ఆందోళన రైతులను వెంటాడుతోంది.
కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులు? - పోలవరం నిర్మాణంలో ఏపీ తీరుపై కేంద్రం ఆగ్రహం
ఖరీఫ్ ముగిసి రెండు నెలలు గడిచినా రైతులకు పంటల బీమా అమలవుతుందో, లేదో కూడా తెలియని దుస్థితి. ప్రతి ఎకరా పంటకు ఉచితంగా బీమా కల్పిస్తున్నామని, వివరాలను ఆర్బీకేల్లో సామాజిక తనిఖీలకు ఉంచామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్పితే ఏ రైతు పంటకు ఎంత ఇన్సూరెన్స్ చేశారనేది ఎవరికీ తెలియని పరిస్థితి. తుపానుతో నిండా మునిగామని రైతులు కంటనీటితో అల్లాడుతుంటే కేంద్ర పంటల బీమా పోర్టల్‌లో మాత్రం రాష్ట్ర వివరాలే లేవు. ఈ-క్రాప్, ఈకేవైసీ చేసిన ప్రతిఒక్క రైతుకి నిబంధనల ప్రకారం బీమా అమలవుతుందని వ్యవసాయ శాఖ చెబుతున్నా దానిపై స్పష్టతే లేదు. తీరా బీమా పరిహారం చెల్లింపు సమయంలో మీ పంటలకు బీమా లేదని చెబుతూ అన్నదాతకు మొండిచేయి చూపిస్తున్నారు. ప్రభుత్వం అంటున్నట్లు వంద శాతం ఈ-క్రాప్ అనేది కూడా అంతా మాయే. ఈ-క్రాప్, పంటల బీమాలో తమ పేరు నమోదైందో, లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం లేదు.
నిరుద్యోగులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసా? - తీవ్ర నిరాశలో యువత
కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పోర్టల్‌లో 19 రాష్ట్రాలకు సంబంధించిన వివరాలున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ గణాంకాలను పరిశీలిస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 3 జిల్లాలు, 16 మంది రైతులు, 0.04 హెక్టార్ల విస్తీర్ణానికి మాత్రమే బీమా ఉన్నట్లు కన్పిస్తోంది. ఇక వాతావరణ ఆధారిత బీమాలో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. కేంద్ర పోర్టల్‌లో నమోదు చేసేందుకు అక్టోబరు చివరి వరకు సమయం ఉందని వ్యవసాయ శాఖ గతంలో తెలిపింది. కాని ప్రస్తుతం డిసెంబరు మొదటి వారం అయిపోతున్నా పోర్టల్‌లో మాత్రం రైతుల వివరాలేవీ కనిపించడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాలతో రైతులకు మంచి జరగడం లేదని మొదట్లో వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అందుకే ఆ పథకాల నుంచి బయటకు వచ్చి సొంతంగానే ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పింది. ఈ పథకం ప్రారంభించిన రెండేళ్లకే తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. మళ్లీ కేంద్రం శరణు కోరింది.
ఐటీఐ కాలేజీలను గాలికొదిలేసిన జగన్ సర్కార్! 8వేల రెగ్యులకు పోస్టులకు 1,140 మాత్రమే బోధనా సిబ్బంది
రాష్ట్రంలో సాగుచేసిన ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తీరా ఆచరణకు వచ్చేసరికి నోటిఫైడ్ పంటలకేనంటూ సాకులు చెబుతోంది. రాష్ట్రం సొంతంగా బీమా పథకాన్ని అమలు చేసిన సమయంలోనూ ఇలాగే నోటిఫైడ్ పంటల పేరిట అధిక శాతం రైతులకు బీమా పరిహారాన్ని ఎగ్గొట్టింది. మామిడి పంటకు వర్తింపజేయలేదు. మిరప రైతులకూ మొండిచేయి చూపింది. పత్తి, కంది తదితర పంటల రైతులకూ నామమాత్ర పరిహారంతోనే సరిపెట్టింది. కేంద్ర బీమా నిబంధనల ప్రకారం ఒక జిల్లాలో ఏదైనా పంటకు బీమా అమలు చేయాలంటే ఆ పంటను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేసి ఉండాలి. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాల వారీగా అన్ని పంటల విస్తీర్ణం తగ్గిపోయింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ బీమా వర్తించడం లేదు. తమ నిబంధనలకు అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండటంలేదని కేంద్ర అధికారులు బీమా అమలులో కోత పెడుతున్నారు. గతేడాది పసుపు రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.