Jagan Government Harassing Teachers with Show Cause Notices: ఉపాధ్యాయులపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఒక పక్క పాఠశాలల్లో తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను హడలెత్తిస్తున్న ప్రభుత్వం.. మరోపక్క చిన్న చిన్న కారణాలకే ఛార్జి మెమోలు, షోకాజ్ నోటీసులు ఇస్తోంది. నోట్‌బుక్, వర్క్‌బుక్‌లు రాయించలేదని, వాటిని దిద్దలేదని నోటీసులిస్తూ భయపెడుతోంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్.. ఇటీవల నెల్లూరు జిల్లాలోని ఓ పాఠశాలను సందర్శించారు. సిలబస్ పూర్తికాలేదని, వర్క్‌బుక్స్ దిద్దలేదని.. డీఈవో, ఆర్జేడీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓలు, ఆర్జేడీలు తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు.
డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు రోజుకు రెండు, మూడు బడుల చొప్పున తనిఖీలు చేస్తూ.. ఏ చిన్న కారణంతో దొరికినా ఛార్జి మెమోలు, షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 138 మందికి ఛార్జి మెమోలు, నెల్లూరు జిల్లాలో 54, గుంటూరులో 50, కృష్ణాలో 14, కర్నూలులో 10 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నంద్యాలలో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో నోటీసులు జారీచేసిన 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించగా.. నెల్లూరులో మాత్రం మూడు రోజుల్లోనే వివరణ ఇవ్వాలని డీఈవో ఆదేశించారు.
ప్రభుత్వ ఉన్నతాధికారుల చర్యలు ఇప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో పాఠాలు చెప్పేందుకు సరిపడా సిబ్బంది ఉండట్లేదు. మరోవైపు సస్పెన్షన్ ఎత్తేస్తే అన్ని ప్రయోజనాలను కల్పించాల్సి వస్తోందని.. ఇప్పుడు ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు నష్టం కలిగించేలా చర్యలు చేపట్టారు. ఛార్జిమెమో పెండింగ్‌లో ఉంటే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు సకాలంలో అందవని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వాట్సప్ వీడియో కాల్‌లోనూ తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం సమయంలో వాట్సప్ వీడియో కాల్ చేస్తే విద్యార్థులు నోట్, వర్క్‌బుక్స్‌ను ఆయనకు చూపించాలి. సమ్మెటివ్-1 పరీక్షకు అవసరమైన సిలబస్ పూర్తయిందో.. లేదో విద్యార్థులను ఫోన్‌లో అడిగి తెలుసుకుంటారు. ఎలాంటి లోపాలు బయటపడినా అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి నెలా స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు గుంటూరు డీఈవో ఆదేశాలు జారీ చేశారు. సిలబస్ పూర్తి చేశారా.. లేదా? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ రాశారు? వీటిని దిద్దారా? పాఠ్యప్రణాళిక సిద్ధం చేశారా? ఇలాంటి వివరాలను స్వీయ ధ్రువీకరణతో ఉపాధ్యాయులు సమర్పించాలి. దీన్ని ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించి, ఉన్నతాధికారులకు సమర్పించాలి. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయులను హడలెతిస్తున్నాయి.