Jagan Cheated Farmers on Electricity Connections to Bore Wells: 2020 సెప్టెంబర్ 28న వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభించిన సందర్భంలో సీఎం జగన్ అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి అన్నదాతలను మోసం చేశారు. రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చి మాట మార్చారు. బీడువారిన భూములను వైఎస్సార్ జలకళతో ప్రభుత్వ ఖర్చుతోనే జలాభిషేకం చేయిస్తానని నమ్మబలికిన ముఖ్యమంత్రి అన్యాయం చేశారు. బోర్లు తవ్విన చోట విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల చొప్పున కట్టాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థలు లబ్ధిదారులకు తాజాగా నోటీసులు పంపుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతా ఉచితమని భరోసా కల్పించి చివరకు 'రివర్స్' కావడంపై మండిపడుతున్నారు.
హామీ నాది మీరే నెరవేర్చుకోండి: ప్రజలకిచ్చిన హామీలు 99.5 శాతం ఇప్పటికే నెరవేర్చామని తరుచూ గొప్పగా చెప్పుకొనే సీఎం జగన్ రైతులకిచ్చిన ఈ హామీపై ఏం సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. "అంతా ఉచితమని చెప్పి ఇప్పుడు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు డబ్బు చెల్లించాలనడం మోసం చేయడం కాదా హామీ నాది మీరే నెరవేర్చుకోండి అనే తరహాలో వ్యవహరించడం సరైందేనా అని రైతులు మండిపడుతున్నారు. వైఎస్సార్ జలకళ ప్రారంభోత్సవంలో సీఎం మాటలను నమ్మిన 2 లక్షల 32 వేల మంది రైతులు ఈ పథకాలనికి దరఖాస్తులు చేశారు. అన్నీ ఉచితమని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి పథకానికి ప్రాధాన్యం తగ్గించింది.
జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్!
రైతులపైనే మొత్తం భారం: రైతుల భూముల్లో తవ్వించిన బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే ఒక్కో కనెక్షన్‌కు సగటున 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల బోర్లకు వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాట తప్పిన కారణంగా ఈ భారం మొత్తం రైతులపైనే పడనుంది. ఇప్పటివరకు తవ్విన బోర్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలన్నా 954 కోట్ల 48 లక్షలు ఖర్చు అవుతుంది. బోర్లకు విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని దరఖాస్తులు చేసుకుంటున్న రైతులు 4 నుంచి 5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులు పంపుతున్నాయి. లైన్ల కోసం స్తంభాలు ఎక్కువ అవసరమైన చోట 8 నుంచి 10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. తమది రైతు ప్రభుత్వమని ఊరూవాడా బాకా ఊదుకుంటున్న సీఎం జగన్ బక్కచిక్కిన కర్షకులపై భారం మోపుతున్నారు.
ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ
రైతుల భూముల్లో ఎంతో హడావుడిగా బోర్లు వేయించే ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం క్రమంగా జోరు తగ్గించింది. బోర్లు తవ్విన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా డ్రిల్లింగ్ వాహనాలను పక్కన పెట్టారు. కొద్ది నెలలుగా బోర్లు తవ్వే కార్యక్రమం అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా నిలిచిపోయింది. బోర్లు తవ్విన చోట పంపుసెట్ ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమం నత్తకు నడకలు నేర్పేలా సాగుతోంది.
విద్యుత్తు సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం మాట మార్చడంతో ఇందుకయ్యే లక్షల రూపాయల ఖర్చును భరించేందుకు సిద్ధంగా లేమని రైతులు అంటున్నారు. దీంతో ఇప్పటివరకు తవ్విన 23 వేల 935 బోర్లలో 4 వేల 795 బోర్లకే పంపుసెట్లు బిగించి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. వీటిలో అత్యంత తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకటి కోనసీమ జిల్లాలో నాలుగు బోర్ల పంపుసెట్లకు కనెక్షన్లు జారీ చేశారు.