Irregularities in Government Teachers Transfers: సాధారణ ఉపాధ్యాయ బదిలీలు పూర్తయిన తరువాత బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. ఈ ఏడాది అలాంటి చర్యలు తీసుకోకుండా దొడ్డిదారి బదిలీలకు తెర తీశారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో మంత్రి పేషీకి ఉపాధ్యాయులు బారులు తీరుతున్నారు.ప్రజాప్రతినిధులు, నాయకుల లేఖలే ఆధారంగా కమిషనరేట్‌కు ఈ-మెయిల్, వాట్సప్‌ల్లో జాబితా వెళ్లిపోతోంది. అక్కడి నుంచి జిల్లా విద్యాధికారులకు సమాచారం పంపిస్తున్నారు. బదిలీలు వాట్సప్‌లో జరిగిపోవడంపై ఉపాధ్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
మంత్రి పేషీలోని ఓ అధికారి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మంత్రి పేషీలోని కీలక అధికారి వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారని.. కోరుకున్న చోటకు బదిలీ కావాలంటే రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మంత్రి పేషీలో కీలక అధికారి గతంలో ఇంటర్మీడియట్ ఒప్పంద ఉద్యోగులకు కొందరికి పోస్టింగ్‌లు ఇప్పించేందుకు రూ. 8 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనకు రాజకీయ పెద్దల అండదండలు ఉండటంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
Teachers Transfers Guidelines : ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు నూతన మార్గదర్శకాలు విడుదల
గతంలో బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో సీఎం కార్యాలయం అనుమతితోనే బదిలీలు నిర్వహించేవారు. ఇప్పుడు ఏడాది పొడవునా చేస్తుండటంతో మంత్రి పేషీ అనుమతితో బదిలీలు జరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో కొందరు ఉపాధ్యాయులు బదిలీలకు సీఎంఓకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని అక్కడ తిరస్కరించినా మంత్రి పేషీ ఆమోదించేసింది. మొదట్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అవసరం మేరకు అని బదిలీలను చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయినులకు మాత్రమే అంటూ మరో లిస్ట్‌ను కమిషనరేట్‌కు పంపించారు.
ఉమ్మడి గుంటూరుకు 160, ప్రకాశం జిల్లాకు 70, శ్రీకాకుళం జిల్లాకు 20 సిఫార్సు బదిలీ లేఖలు పంపించారు. ఇతర జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. మెమో లేదా ఉత్తర్వు ద్వారా బదిలీ నిర్వహించాల్సిన కమిషనరేట్ సైతం ఈ-మెయిల్, వాట్సప్‌ల్లో జాబితాలను పంపించి, డీఈఓలపై ఒత్తిడి చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
AP High Court: ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాల జీవో ఉపసంహరణ
రాజకీయ పలుకుబడితో బదిలీలకు జాబితాలను పంపుతున్న కమిషనరేట్.. క్షేత్రస్థాయి డీఈఓలను మాత్రం నిబంధనలు పాటించాలంటోంది. బదిలీ కోరుకున్న టీచర్ ఏకోపాధ్యాయుడు అయి ఉండకూడదని, కోరుకున్న బడిలో పోస్టు అవసరం ఉందో లేదో చూడాలని చెబుతోంది. ఎక్కడైనా సిఫార్సు బదిలీల జాబితా వస్తే.. క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించుకొని, ఒక ఉత్తర్వు ద్వారా బదిలీ చేయడం నిబంధన. ఇందుకు విరుద్ధంగా వాట్సప్‌లో లిస్ట్‌లను పెడితే నిబంధనలు ఎలా అమలవుతాయి? బదిలీ సమయంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు దగ్గరలోని పోస్టులను బ్లాక్ చేశారు.
ఇప్పుడు వీటిని రాజకీయ పైరవీ బదిలీలకు కేటాయిస్తున్నారు. ఇదికాకుండా మరోపక్క సర్దుబాటు పేరుతో బదిలీలు సాగిపోతుండటం మొత్తంగా విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తోంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలానికి ఆరుగురు సిఫార్సులు పొందగా.. అక్కడ ఒక్క పోస్టూ ఖాళీగా లేదు. ఒంగోలు మండలంలో ఒక స్థానానికి 10 మందికి బదిలీ లెటర్లు ఇచ్చారు. పైరవీ బదిలీలు పొందిన దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండడంతో ఏం చేయాలో తెలియక డీఈఓలు తలలు పట్టుకుంటున్నారు.
కొంతమంది ఉపాధ్యాయులు ఒక చోటకు లేఖ తెచ్చుకొని, అక్కడ పోస్టు ఖాళీ లేకపోతే దగ్గరలో ఉన్నచోట చేరిపోతున్నారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు పైరవీ బదిలీ పొందితే ఎనిమిదేళ్ల వరకు అక్కడే ఉండొచ్చనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు సైతం నేతలు కోరినంత సొమ్మును ఇస్తున్నారు. ఇంటికి దగ్గరగా ఉన్నవాటికి, హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా వచ్చేచోటికి బదిలీల కోసం నేతలను ఆశ్రయిస్తున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు దాటాక ఇప్పుడు సర్దుబాటు పేరిట బదిలీలు చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అంతర్జాతీయ సిలబస్, సీబీఎస్‌ఈ, టోఫెల్ అంటూ గొప్పలు చెప్పడమే తప్ప బోధన గురించి పట్టించుకోరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు రాజకీయ పలుకుబడి లేనివారికి ఎప్పటికీ కోరుకున్నచోట పోస్టు దొరకకుండా చేస్తారా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
Teachers Protest In kurnool: సమస్యలు పరిష్కరించాలని.. భాషా పండితుల ఆందోళన