ఆ రైతుకి ఏదైనా వినూత్నంగా చేయాలని ఆసక్తి. దానికోసం ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్ముకొని వచ్చిన మూడు లక్షలతో గత కొంత కాలంగా తక్కువ ఖర్చుతో ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే యంత్రాలను తయారు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఆయనే గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన రైతు కక్కెర సాంబశివరావు. ఇప్పటికే సోలార్ ద్వారా తిరిగే మోపెడు ద్విచక్రవాహనాన్ని రూపొందించిన సాంబశివరావు... తాజాగా వికలాంగులకు ఇబ్బంది లేకుండా మూడు చక్రాల సైకిల్‌ను తక్కువ ఖర్చుతో ఎలక్ట్రికల్ వాహనంగా రూపొందించాడు.
మూడు చక్రాల సైకిల్‌కు 650 వాట్స్ మోటర్ 1, 12 వోల్ట్స్ 13 ఏఎంపీఎస్ బ్యాటరీలు 4 ఏర్పాటు చేశాడు. దీనికి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే... 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రూపాయి ఖర్చు లేకుండా ఈ వాహనాన్ని వాడుకోవచ్చని సాంబశివరావు అంటున్నాడు. మధ్యలో బ్యాటరీ అయిపోయినా... యధావిధిగా చేతితో సైకిల్ లాగా పనిచేస్తుందన్నారు. రైతులకు సంబంధించి కొన్ని యంత్రాలను తయారు చేస్తున్నట్లు.. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకువస్తానని సాంబశివరావు అంటున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి..కొత్తగా 9,536 కరోనా కేసులు