Election Commission New Electoral Roll : ఈ ఏడాది జనవరిలో ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితా ప్రకటించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జాబితా పరిశీలిస్తే... వందల సంఖ్యలో దొంగ ఓట్లు కనిపించాయి. ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవడం కోసం పక్కా ప్రణాళికతో దొంగ ఓట్లు నమోదు చేశారు. ఓటర్ల జాబితాను పరిశీలిస్తే... శ్యామలా నగర్ 38వ పోలింగ్ బూత్‌లో భారీగా దొంగ ఓట్లు చేర్చినట్లు తేలింది. ఈ ప్రాంతంలో ఉన్న 2-14-121 ఇంటి నెంబర్‌లో ఏకంగా 125 ఓట్లు ఉన్నాయి. ఇదే వరుసలో ఉన్న 121/1లో 47 ఓట్లు, 121/12లో 59 ఓట్లు, 121/13లో 72 మందిని ఓటర్లుగా చేర్చారు. ఇదే ఇంటి నెంబరుతో పండరీపురం బూత్ నంబరు 144లో 125 ఓట్లు నమోదు చేశారు. ఒక్కో ఇంట్లో ఈ స్థాయిలో ఓట్లు ఉన్నా అధికారులు గుర్తించలేదా లేక ఉద్దేశపూర్వకంగా వదిలేశారా అన్నది యంత్రాంగానికే తెలియాలి.
శ్యామలా నగర్ కాలనీలో 2-14-151 ఇంటి నెంబర్‌లో ఓ విద్యాసంస్థ నిర్వహిస్తున్నారు. అయితే ఇదే చిరునామాతో 20 మంది యువతులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరందరికీ 21 నుంచి 24ఏళ్లలోపు వయసు ఉన్నట్లు నమోదు చేశారు. కళాశాల నిర్వహించే భవనం చిరునామాతో ఓటర్లను ఎలా నమోదుచేశారో, ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుందో యంత్రాంగానికే తెలియాలి. శ్యామలా నగర్‌లోనే ఎమ్మెల్యే నివాసం ఉన్న వీధిలో ఒక బహుళ అంతస్థుల భవనంలో 110 ఓట్లు ఉన్నాయి.
ఇందులో ప్రస్తుతం నివాసం ఉన్న ఓటర్లు 20 మంది మాత్రమే. ఇదే కాలనీలో 9-1-19 ఇంటి చిరునామాతో 84 మందిని ఓటర్లుగా చేర్చారు. వీరిలో ఎక్కువమంది స్థానికులు కాదు. ఈ ప్రాంతంలో వ్యక్తిగత నివాసాల్లో ఒకే ఇంటి నెంబరుపై ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నాయని... వారెవరూ ఇక్కడ లేకపోయినా జాబితాలో పేరుండటం చూస్తుంటే భారీకుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే దొంగ ఓట్లను తొలిగించి... బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నగరపాలక ఎన్నికల్లో దొంగ ఒట్లతోనే వైఎస్సార్సీపీ గెలిచిందని... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ అలాగే విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోందని తెలుగుదేశం ఆరోపించింది. తప్పుల తడకలా ఉన్న ఓట్ల జాబితాను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందజేస్తామని నేతలు చెప్పారు.
2020లో కొత్త ఇంటి నెంబర్లు ఇచ్చినా ఇప్పటికీ పాత నంబర్లు కొనసాగుతుండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని నగరపాలక సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచి బదిలీ అయినవారి ఓట్లు తొలగించకపోవడం, తాత్కాలిక నివాసం ఉన్నవారికి ఓటుహక్కు కల్పించాలనే లక్ష్యంతో నివాసానికి సమీపంలో ఉన్న ఇంటి నెంబరుతో ఓటు ఇవ్వడం ద్వారా తప్పులు దొర్లాయని అధికారులు అంటున్నారు.