AP DEBTS : దొరికినంత అప్పు తెచ్చుకో... పూట గడిపేయ్.. ఆ అప్పుు తీర్చడానికి మళ్లీ అప్పుచేయ్! అన్న తీరుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది. లెక్కకు మించి అప్పులు చేస్తే సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్ నివేదికలు వరుసగా రాష్ట్రాన్ని తీవ్రంగా హెచ్చరించినా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే రాష్ట్రం ఏకంగా 15 వేల 500 కోట్ల రుణాన్ని ఒక్క బహిరంగ మార్కెట్నుంచే సమీకరించింది. మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని 2 వేల కోట్ల అప్పు తీసుకుంది. పదేళ్ల కాలపరిమితితో తీర్చేలా 7.37 శాతం వడ్డీకి వెయ్యి కోట్ల రూపాయలు, 12 ఏళ్ల కాలపరిమితితో 7.36 శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్ల రూపాయల రుణం తీసుకుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 9 నెలల కాలానికి అనుమతించిన అప్పుల్లో సగం రుణం ప్రభుత్వం తొలి రెండు నెలల్లో తీసేసుకున్నట్లు అయ్యింది.
2014-15 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు కింద నిధులివ్వాలని రాష్ట్రం ఎప్పటినుంచో కోరుతూ వస్తోంది. దీంతో మే నెలలో రెవెన్యూ లోటు గ్రాంటు కింద కేంద్రం ఏకంగా 10 వేల 460 కోట్లను రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ప్రతి నెలా వచ్చే అవకాశం లేదు. అదనపు నిధులు వచ్చిన నెలలోనూ ఏకంగా 9 వేల500 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణం ప్రభుత్వం తీసుకొంది. దీనికి తోడు ప్రతి నెలా ఖజానాకు వచ్చే రాబడి ఎలాగూ ఉంది.
ఏపీలో పెరిగిన అప్పులు.. దాచిపెట్టేందుకు సర్కార్ తిప్పలు
కేంద్రం ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ మార్కెట్ ద్వారా రుణాలు సమీకరించుకునేందుకు అనుమతిస్తుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ అంచనా వేసి ఇందులో దాదాపు 3.5 శాతం మేర రుణాలు తీసుకునే వీలు కల్పిస్తుంది. ఇందులో నుంచి ఇతర రూపాల్లో తీసుకునే రుణాల మొత్తాన్ని మినహాయిస్తుంది. ఆ ఆర్ధిక సంవత్సరంలో పాత రుణాలను ఎంత మేర తీరుస్తున్నారో ఆ మొత్తాలను కలుపుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పులు మంజూరు చేస్తుంది.
TDP CHARGESHEET ON YCP: సీఎం జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ ఛార్జిషీట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 30 వేల 275 కోట్ల రుణం తొలి తొమ్మిది నెలల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చని అనుమతించింది. అలాంటిది ఏకంగా తొలి రెండు నెలల్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15 వేల 500 కోట్ల అప్పులు చేసింది. కేంద్రం 9 నెలలకు మంజూరు చేసిన అప్పుల మొత్తం ఆధారంగా సగటున నెలకు 3 వేల 400 కోట్ల రూపాయల రుణం సమీకరించేందుకే అవకాశముంది. అలాంటిది ఈ పరిమితిని మించి అప్పు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలోనే 6 వేల కోట్ల రుణం తీసుకుంది. మే నెలలో ఇంతకుమించింది. రెండో నెలలో ఏకంగా 9 వేల500 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. అనుమతించిన సగటు అప్పుతో పోలిస్తే అది ఎంతో ఎక్కువ.
ఇవీ చదవండి