రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కొన్ని సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పిల్లల పెంపకమే సరిగా ఉండటం లేదని విశాఖపట్నంలో ఆమె మాట్లాడి చర్చలకు తావిచ్చారు. మంగళవారం గుంటూరులో రేపల్లె అత్యాచార ఘటనపై స్పందించిన తీరూ చర్చలకు అవకాశం కల్పించింది. ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘అత్యాచారానికి పాల్పడినవారు అసలు అమ్మాయిపై అత్యాచారం చేయాలని రాలేదు. వాళ్లు తాగి ఉన్నారు. డబ్బుల కోసం భర్తపై దాడి చేశారు. భర్తను రక్షించుకోవటానికి ఆ అమ్మాయి వెళ్లినప్పుడు ఆమెను నెట్టేసే విధానం, బంధించే విధానంలోనే అత్యాచారానికి గురైంది. పేదరికంవల్లో, మానసిక పరిస్థితులవల్లో అప్పటికప్పుడు కొన్ని అనుకోని రీతిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి..’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు, పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. శాఖలో కొరత కొంత ఉన్నది వాస్తవమేనని చెప్పారు. పోలీసుల కొరతపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: Rape at Repalle: రేపల్లెలో దారుణం.. భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం